logo

నకిలీ మావోయిస్టుల అరెస్టు

మావోయిస్టులమని బెదిరించి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సుంచు మల్లేష్‌ను సోమవారం ఉదయం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపారు.

Published : 21 Mar 2023 05:24 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటగిరి, సీఐలు రాఘవేందర్‌, నరసింహారావు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మావోయిస్టులమని బెదిరించి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సుంచు మల్లేష్‌ను సోమవారం ఉదయం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మిర్యాలగూడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్‌రెడ్డి 1996 నుంచి 1998 వరకు జనశక్తి సంస్థ కొరియర్‌గా పనిచేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత 2001లో ప్రభుత్వం నుంచి ఆయుధ లైసెన్సు పొంది హైదరాబాద్‌ హబ్సిగూడలో నివాసం ఉంటూ రియల్‌ వ్యాపారం సాగించాడు. ఇందులో భారీగా నష్టాలు వచ్చాయి. సులువుగా డబ్బులు సంపాదించేందుకు మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన సుంచు మల్లేష్‌తో చేతులు కలిపాడు. ఇద్దరు కలిసి వ్యాపారులపై బెదిరింపులకు దిగారు. వీరిపై పలు కేసులు నమోదు కాగా ఇద్దరిని గతంలో పోలీసులు అరెస్టుచేశారు. ఇటీవల మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్‌ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి తాము మావోయిస్టులమని బెదిరించి రూ.5 లక్షలు ఇవ్వాలని లేనిచో చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన గౌరు శ్రీనివాస్‌ ఈనెల 18న ఆన్‌లైన్‌లో రూ.10వేలు పంపాడు. మిగతా డబ్బుల కోసం సోమవారం ఉదయం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండుకు వచ్చి గౌరు శ్రీనివాస్‌కు ఫోన్‌చేశారు. ముందస్తు సమచారంతో పోలీసులు నిఘా పెట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించినన సీఐ రాఘవేందర్‌, ఎస్సై లు సైదిరెడ్డి, కృష్ణయ్య హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మయ్య కానిస్టేబుళ్లు, వెంకటేశ్వర్లు, రామకృష్ణలను డీఎస్పీ అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని