logo

ఊబి నుంచి ఉన్నతి వైపు..!

ఉమ్మడి జిల్లాలోని పలు బ్యాంకు శాఖల్లో అంతులేని ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలు, దేవరకొండ శాఖలో రూ.30 కోట్ల మేర భారీ కుంభకోణం, అనర్హులకు ఉద్యోగాలిచ్చారనే ఆరోపణలు, ఛైర్మన్‌కు, డీసీసీబీ డైరెక్టర్లకు మధ్య ఆధిపత్య పోరు..గతంలో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) అనగానే ఇవే గుర్తొచ్చేవి

Updated : 22 Mar 2023 05:37 IST

ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగిన నల్గొండ డీసీసీబీ
ఈనాడు, నల్గొండ

నల్గొండ డీసీసీబీ కార్యాలయం

ఉమ్మడి జిల్లాలోని పలు బ్యాంకు శాఖల్లో అంతులేని ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణలు, దేవరకొండ శాఖలో రూ.30 కోట్ల మేర భారీ కుంభకోణం, అనర్హులకు ఉద్యోగాలిచ్చారనే ఆరోపణలు, ఛైర్మన్‌కు, డీసీసీబీ డైరెక్టర్లకు మధ్య ఆధిపత్య పోరు..గతంలో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) అనగానే ఇవే గుర్తొచ్చేవి. అయితే కొత్త పాలకవర్గం కొలువుదీరిన ఈ మూడేళ్లలో అంచెలంచెలుగా బ్యాంకును గాడిలో పెట్టి..ప్రస్తుతం రూ.65 కోట్ల మేర లాభంలో కొనసాగుతోంది. వివిధ పథకాలతో ప్రజలకు చేరువై మొండి బాకీలను వసూలు చేయడంతో పాటూ నిరర్ధక ఆస్తుల విలువ (ఎన్‌పీఏ)ను రెండు శాతంలోపే తగ్గించుకోవడం విశేషం. శత వసంతాల (103) చరిత్ర ఉన్న ఎన్‌డీసీసీబీ ఈ మూడేళ్లలో బ్యాంకు టర్నోవర్‌, ఎన్‌పీఏ తగ్గించుకోవడంలో రాష్ట్రంలో ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ నెల 24 (శుక్రవారం)న నల్గొండలో ఎన్‌డీసీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో ‘సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనా’న్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బ్యాంకు పాలకవర్గం నిర్ణయించింది.

రూ. రెండు వేల కోట్లకు పైగా టర్నోవర్‌

ఎన్‌డీసీసీబీ బ్యాంకును 1917లో ఏర్పాటు చేయగా...2020 వరకు రూ.900 కోట్ల టర్నోవర్‌తో పీకల్లోతూ నష్టాల్లో ఉండేది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం (2023 మార్చి 31) ముగింపు నాటికి బ్యాంకు వ్యాపారం (టర్నోవర్‌) రూ.2200 వేల కోట్లకు చేరుకుంది. ఈ మేరకు ఇటీవలే బ్యాంకు ఆడిట్‌ బృందం వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం రూ.570 కోట్ల డిపాజిట్లతో గతంలో పోలిస్తే 43 శాతం మేర డిపాజిట్లను పెంచుకుంది.
*  గతంలో వసూళ్లు 81 శాతం ఉండగా...ప్రస్తుతం అది 91 శాతానికి చేరింది. ఏదైనా ఒక బ్యాంకు ఆర్థిక వృద్ధి నిరర్ధక ఆస్తుల విలువ (ఎన్‌పీఏ)పైనే ఆధాపడి ఉంటుంది. ఇది 5 శాతం కంటే తక్కువున్న బ్యాంకులు నష్టాల్లో లేనట్లు లెక్క. ప్రస్తుతం ఎన్‌డీసీసీబీ ఎన్‌పీఏ 1.98 శాతం కావడం ప్రస్తుత బ్యాంకు పురోగభివృద్ధిని సూచిస్తోంది.
*  గత మూడేళ్లలో వరుసగా రూ.11.42 కోట్లు, రూ.23.68 కోట్లు, రూ. 30 కోట్లు మొత్తం రూ.65 కోట్ల లాభం గడించి రాష్ట్రంలో కరీంనగర్‌ బ్యాంకు తర్వాత రెండో స్థానంలో ఉంది.

కర్షకమిత్రతో రుణాలు..

* రైతు తనకున్న భూమిని తనఖా పెట్టి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం తీసుకునే సదుపాయాన్ని రెండేళ్ల క్రితం కర్షకమిత్ర పేరుతో బ్యాంకు అమలు చేస్తోంది. దీనికి మంచి స్పందన ఉండటంతో గత రెండేళ్లలో ఈ పథకం కింద సుమారు 3 వేల మందికి రూ.210 కోట్ల రుణాలిచ్చారు.
*  విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు తక్కువ ధ్రువపత్రాలతో ఏక గవాక్ష పద్ధతి (సింగిల్‌ విండో) ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 905 మంది విద్యార్థులకు రూ. 139 కోట్లు రుణాలుగా చెల్లించగా..వారంతా ప్రస్తుతం వివిధ దేశాల్లో చదువుతున్నారు.
*  బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను అందించాలనే లక్ష్యంతో హెచ్‌ఆర్‌ పాలసీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా కార్పస్‌ ఫండ్‌తో పాటూ రూ.2.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు.
*  గతంతో పోలిస్తే ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాల పంపిణీలోనూ పెరుగుదల శాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో మరో 15కు పైగా శాఖలను పెంచేందుకు ఇప్పటికే పాలకవర్గం కేంద్ర సహకార శాఖ, నాబార్డుకు ఇప్పటికే పలుమార్లు ప్రతిపాదనలు పంపింది.


వచ్చే రెండేళ్లలో రూ.3 వేల కోట్ల వ్యాపారం...

మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ పాలకవర్గ సభ్యుల సహకారంతోనే అప్పుల ఊబిలో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించాం. వచ్చే రెండేళ్లలో బ్యాంకు టర్నోవర్‌ రూ.3 వేల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. మూడు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే నల్గొండ, భువనగిరిలో మొబైల్‌ ఏటీఎం వాహనాలను ప్రారంభించాం. ఈ నెల 24న సూర్యాపేటలో ఏటీఎం వాహనాన్ని ప్రారంభించనున్నాం. కొత్త శాఖల ఏర్పాటు కేంద్రం, నాబార్డు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ఆమోదం రాగానే అవసరమున్న ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తాం.
 గొంగిడి మహేందర్‌రెడ్డి, ఛైర్మన్‌, ఎన్‌డీసీసీబీ, వైస్‌ఛైర్మన్‌ టెస్కాబ్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని