logo

నకిలీ బంగారం విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు: ఎస్పీ

అమాయకులను ఆసరాగా చేసుకుని నకిలీ బంగారం విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

Published : 22 Mar 2023 04:05 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అపూర్వరావు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: అమాయకులను ఆసరాగా చేసుకుని నకిలీ బంగారం విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ అపూర్వరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని జలోర్‌ జిల్లా బిస్మల్‌ మండలం వగ్రియోంక గ్రామానికి చెందిన పంచారామ్‌, గులాబ్‌ రామ్‌, ఉమారంలు ముగ్గురు కలిసి అక్కడ ప్లాస్టిక్‌ పూల వ్యాపారం చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి నకిలీ బంగారం చూపించి అక్రమ సంపాదన పొందే మార్గం ఎంచుకున్నారు. అందులో భాగంగా కె. మల్లేపల్లి మండలం అంగడిపేట గ్రామానికి చెందిన ఎం.ధర్మరాజు అతని భార్య అభినయను ఈ నెల 5న కలిసి తమకు గుంటూరు జిల్లాలో ఇంటి నిర్మాణం చేస్తుండగా బంగారం దొరికిందని కిలోన్నర హారాన్ని చూపించారు. ముందుగా మచ్చుకు రెండు బిల్లలు ఇవ్వడంతో ధర్మరాజు స్థానికంగా ఉన్న కంసాలికి చూపడంతో బంగారం వస్తువులేనని చెప్పాడు. రెండు రోజుల తరువాత నకిలీ హారం ఇచ్చి రూ.3 లక్షలు తీసుకెళ్లారు. అదే విధంగా ఈనెల 20న కొండమల్లేపల్లిలో వ్యాపారి పూరి శేషయ్యకు మరో  బంగారం హారం అమ్మాలని చూడగా.. గమనించిన అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేయగా వాస్తవాలు ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, ఎస్సై శ్రీనివాస్‌, వీరబాబు, సతీష్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు