logo

భత్యంతో బడికి..!

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి..అందరు చదవాలి.. అందరు ఎదగాలి. ఇది ప్రభుత్వాల నినాదం. ఇందు కోసం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నాయి.

Published : 24 Mar 2023 04:44 IST

ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల వివరాలతో ప్రతిపాదనలు
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే:

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి..అందరు చదవాలి.. అందరు ఎదగాలి. ఇది ప్రభుత్వాల నినాదం. ఇందు కోసం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వాలు ఎంతో ఖర్చు పెడుతున్నాయి. అయినా ఇంకా అందరికీ విద్య పూర్తిస్థాయిలో అందడం లేదు. బడి బాట పట్టడానికి నేటికీ పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడక్కడ నెలకొంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతానికి కిలో మీటరు లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి. మూడు కిలో మీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఆయా పాఠశాలల్లో చదువుకోవడానికి ఆవాస ప్రాంతం నుంచి రవాణా సదుపాయం ఉండాలి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఆవాస ప్రాంతాల నుంచి బడి బాట పట్టేందుకు నిర్ధేశించిన పరిధిలో పాఠశాలలు లేక దూరంగా ఉండి చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులకు బస్సు, రవాణా సదుపాయం లేని వారికి రవాణా భత్యం చెల్లించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రవాణా భత్యం 3,523 మంది విద్యార్థులకు చెల్లించేందుకు ప్రాథమికంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.  

* నల్గొండ జిల్లాలో రవాణా భత్యం కోసం ప్రస్తుత విద్యా సంవత్సరం 2022-23లో 1,796 మందికి రవాణా భత్యం చెల్లిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జిల్లాలోని 217 ఆవాస ప్రాంతాల నుంచి 1,495 మంది విద్యార్థులను రవాణా భత్యం చెల్లించేందుకు ప్రాథమికంగా నివేదిక పంపించారు. నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో నేరెడుగొమ్ము, నకిరేకల్‌, కొండమల్లేపల్లి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల నుంచి విద్యార్థులు రవాణా భత్యం కోసం ప్రతిపాదించారు. ఈ మూడు మండలాల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.

* సూర్యాపేట జిల్లాలో రవాణా భత్యం కోసం 2023-24 విద్యా సంవత్సరానికి 1,021 మంది విద్యార్థులతో ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2022-23 విద్యా సంవత్సరంలో 754 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నారు. రవాణా భత్యానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.400, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ రవాణా భత్యం పది నెలల పాటు ఇస్తారు. సమగ్ర శిక్షా కింద విద్యా శాఖ అధికారులు నివేదిక పంపించారు. వాటిలో పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరానికి అర్హుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆయా విద్యార్థులకు ప్రతి నెల రవాణా భత్యం బ్యాంకు ఖాతాలో పడేలా చూస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని