logo

పల్లెలే దేశం అభివృద్ధికి పట్టుగొమ్మలు: మంత్రి

పల్లెలు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 24 Mar 2023 04:44 IST

ఉత్తమ అవార్డులు అందుకున్న సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్‌రావు, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ పాటిల్‌ కేశవ్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, తదితరులు

భానుపురి, న్యూస్‌టుడే: పల్లెలు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో జడ్పీ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతల్‌ వికాస్‌ జాతీయ ఉత్తమ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా గురువారం మండల స్థాయి ఉత్తమ అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవార్డులతోపాటు జ్హాపికలు అందజేసి మాట్లాడారు. రాకీయాలకు అతీతంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గ్రామాలు పట్టణాలకు పోటీగా నిలుస్తున్నాయన్నారు. జిల్లాలోని అన్నిగ్రామ పంచాయతీలలో సర్పంచుల ఆధ్వర్యంలో ఎనలేని అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 343 వరకు 621 రంగాల్లో అవార్డులు దక్కించుకున్నాయని తెలిపారు. కలెక్టర్‌ వెంకట్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలు అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగుతున్నాయని, ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం సర్పంచులు, కార్యదర్శులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, జడ్పీ సీఈవో సురేశ్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు జీడి భిక్షం, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం

బాలాజీనగర్‌(సూర్యాపేట): సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో ఉందని.. లోహాలను మానవ సమాజానికి అవసరమైన పద్ధతుల్లో మార్చే ఘనత విశ్వకర్మలదేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని చంద్రన్నకుంట కాలనీలో విశ్వకర్మ సంక్షేమ సేవ సమితి ఆధ్వర్యంలో ఆ సంఘం భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణలో అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తూ సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. విశ్వకర్మ భవనానికి 50 లక్షలు మంజూరు చేశామని, త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ యాభై ఏళ్లునిండిన విశ్వకర్మలకు పింఛన్‌ సౌకర్యం కల్పించి, విశ్వకర్మబంధు ఇవ్వాలని కోరారు. పుర అధ్యక్షురాలు పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, పురపాలిక ఉపాధ్యక్షుడు పుట్ట కిషోర్‌, విశ్వకర్మ సంక్షేమ సమితి అధ్యక్షుడు సలేంద్రాచారి, కూరెళ్ల రంగాచారి, డాక్టర్‌ రవీంద్రచారి, దిలీప్‌కుమార్‌, మారోజు హరిచంద్ర, పోలజు శారద, శ్రీకాంత్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు