logo

భువనగిరికి బీఎల్‌సీ మంజూరు చేయండి

చేనేత కార్మికుల ప్రయోజనం కోసం భువనగిరిలో బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్‌ (బీఎల్‌సీ) మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 24 Mar 2023 04:44 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎంపీ కోమటిరెడ్డి వినతి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈనాడు, దిల్లీ: చేనేత కార్మికుల ప్రయోజనం కోసం భువనగిరిలో బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్‌ (బీఎల్‌సీ) మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రిని ఎంపీ గురువారం కలిశారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, మెట్రో విస్తరణపై ప్రధానమంత్రికి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న చేనేత కార్మికుల కోసం బీఎల్‌సీ మంజూరు చేయాలని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆసు మిషన్లు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 70ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మికులను పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల విస్తరణకు నిధులు మంజూరు, ఆ రహదారి వెంట రైలు మార్గం ఏర్పాటు, హైదరాబాద్‌ మెట్రోను ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌కు పొడిగింపు, ఎంఎంటీఎస్‌-2ను ఘట్‌కేసర్‌ నుంచి జనగాం వరకు పొడిగించాలని ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. తన విజ్ఞప్తులకు ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ప్రధానమంత్రితో రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని