logo

పల్లె వాకిట.. ఖాతా వెలిసె..!

గ్రామీణులు వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులకు వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులు పడేవారు.

Published : 24 Mar 2023 04:44 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 150 పల్లె సమగ్ర సేవా కేంద్రాలు

శారాజీపేటలో పల్లెసమగ్ర సేవా కేంద్రంలో నగదు జమ చేస్తున్న మహిళలు  

ఆలేరు, న్యూస్‌టుడే: గ్రామీణులు వివిధ అవసరాల నిమిత్తం బ్యాంకులకు వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులు పడేవారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు పల్లె సమగ్ర సేవా కేంద్రాలను నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లో మహిళా సంఘాలకు అప్పగించారు. వీటిలో అందించే విధులపై మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు రూ.36,500 విలువైన ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌, బ్యాటరీ, స్కానర్‌, వేలిముద్రల సేకరణ సామగ్రిని స్త్రీనిధి నిధులతో సమకూర్చారు. కేంద్రాలలో అంతర్జాల సదుపాయం కల్పించారు.

పల్లె ముంగిట..

ఎస్‌హెచ్‌జీల సభ్యుల లావాదేవీలు, రైతుబంధు సొమ్మును పల్లెసమగ్ర కేంద్రాల ద్వారా పొందొచ్చు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలు, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఆసరా లబ్ధిదారులు, బ్యాంకుల ఖాతాదారులు పల్లె సమగ్ర కేంద్రాల ద్వారా సొమ్మును తీసుకునే, జమచేసే అవకాశం ఉంది. ఎస్‌బీఐ అనుమతితో కూడిన పల్లెసమగ్ర సేవా కేంద్రాలలో 38 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాదారులు రోజుకు రూ.60వేల వరకు, ఇతర బ్యాంకుల ఖాతాదారులు రూ.20 వేల వరకు నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంది.

*  పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటుతో మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తోంది. నగదు ఉపసంహరణ, కొత్త ఖాతాలు, రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాలు తదితర సేవల ద్వారా వీరికి సేవా రుసుములు లభిస్తున్నాయి. ఒక్కో వీఎల్‌ఈ నెలకి రూ.10 వేలకు పైగా ఆదాయం పొందుతున్నారు. పల్లెముంగిట బ్యాంకు సేవలను అందిస్తూ గ్రామీణ ఖాతాదారులకు సహాయకారిగా ఉంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 150 వరకు పల్లె సమగ్ర సేవా కేంద్రాలు ఉండగా..  121 వరకు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో 32, సూర్యాపేట 27, నల్గొండ 62 పల్లె సమగ్ర సేవా కేంద్రాలు ఉన్నాయి. ఖాళీలు ఏర్పడిన కేంద్రాలలో నియామకాలు, కొత్తగా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎస్సీ కేంద్రాలలో నెలకు 15 వందల వరకు, కొన్ని కేంద్రాల్లో నెలకి 25 వందలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కో కేంద్రం ద్వారా రోజుకి రూ.1.5లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లాలోని రామన్నపేట, వలిగొండ మండలాల్లోని సేవా కేంద్రాలలో దినసరి వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతోంది.


ఎస్‌హెచ్‌జీ మహిళలను ప్రోత్సహిస్తున్నాం
- సంతోష్‌, స్త్రీనిధి జిల్లా మేనేజరు, యాదాద్రి భువనగిరి

ఎస్‌హెచ్‌జీల మహిళలు సాంకేతికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్త్రీనిధి అండగా ఉంటుంది. కంప్యూటర్‌పై శిక్షణ, బ్యాంకింగ్‌, మీ సేవలపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాం. గ్రామీణులకు అవసరమయ్యే సేవలన్నింటినీ వీఎల్‌ఈల ద్వారా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రానున్న కాలంలో వీఎల్‌ఈలు నెలకి రూ.20వేలు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నాం.


ఇబ్బందులు తొలగాయి: కంతి కళ్యాణి,
వీఎల్‌ఈ, పల్లె సమగ్ర సేవా కేంద్రం, శారాజీపేట  

బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా చాలా సమయం వరుసల్లో ఉండాల్సి వచ్చేది. పల్లె సమగ్రసేవా కేంద్రాలతో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. బ్యాంకు సేవలు పల్లెముంగిట అందుబాటులోకి రావడంతో ఇబ్బందులు తొలిగాయి. అనుకూల సమయం, సెలవు దినాలతో సంబంధం లేకుండా సేవలు అందుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని