logo

పనులు చేస్తూ.. ప్రాణాలు విడుస్తూ

జాతీయ రహదారి వెంబడి, విభాగిని(డివైడర్‌)ల మధ్య ఉండే మొక్కలు, చెట్ల సంరక్షణ పనులు చేస్తున్న క్రమంలో కూలీలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

గాలిలో దీపంలా మొక్కల సంరక్షణ కూలీల భద్రత
భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే

మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్‌ - విజయవాడ జాతీయరహదారి- 65పై శనివారం మొక్కల సంరక్షణ పనుల్లో ఉన్న ట్రాక్టర్‌ను వెనకాల నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

గతేడాది మార్చి 6న వరంగల్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా ఆలేరు బైపాస్‌ రోడ్డులో విభాగిని మధ్యలో మట్టి పనుల్లో ఉన్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రాయగిరికి చెందిన తోడికోడళ్లు, భార్యాభర్తలు మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం నుంచి పనిచేసి మరో గంటయితే ఇంటికి బయలుదేరే సమయానికి విధి పగబట్టినట్లు వీరిని   కబలించింది.

హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారం క్రాస్‌ రోడ్డు వద్ద విభాగిని మధ్యలో మొక్కలకు నీళ్లు పడుతున్న ట్రాక్టర్‌ ట్యాంకర్‌ను ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.

జాతీయ రహదారి వెంబడి, విభాగిని(డివైడర్‌)ల మధ్య ఉండే మొక్కలు, చెట్ల సంరక్షణ పనులు చేస్తున్న క్రమంలో కూలీలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. కూలీలపైకి ఇతర వాహనాలు మృత్యురూపంలో దూసుకొస్తున్నాయి. పనులు చేసే క్రమంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, గుత్తేదారు సంస్థ సరైన నిబంధనలు పాటించకపోవడం కూలీల పాలిట శాపంగా మారుతోంది. ప్రమాదం జరిగినప్పుడు బాధితుల కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ఇవ్వడం.. తర్వాత పనులు చేయించే క్రమంలో నిబంధనలు విస్మరించడం సాధారణమన్నట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ, రాష్ట్రీయ రహదారుల నిడివి ఎక్కువ. నాలుగు వరుసల రహదారుల మధ్య విభాగినులపై నాటిన మొక్కల సంరక్షణ పనులు చేసే క్రమంలో సరైన భద్రత చర్యలు పాటించకపోవడం పొట్ట కూటి కోసం పనులకు వస్తున్న కూలీలకు శాపంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి పనులు చేస్తున్న సమయంలో ఎక్కడో ఓ చోట కూలీలపైకి వాహనాలు దూసుకొస్తున్నాయి.


హెచ్చరికలు, సూచనలు లేకుండానే..

జాతీయ రహదారిపై ఏవైనా మరమ్మతులు, మొక్కల సంరక్షణ చర్యలు చేస్తున్న క్రమంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు చేసి అదే దారిలో వస్తున్న వాహనాలను అప్రమత్తం చేయాలి. ఇవేవీ పట్టించుకోకుండా కూలీలతో పనులు చేయిస్తున్నారు. వాహనాల అతివేగం, అవగాహన రాహిత్యం కూలీల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. జాతీయ రహదారి మరమ్మతులు, ఇతర పనులు చేపట్టేటప్పుడు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టాలి. వేగంగా వెళ్తున్న వాహనాలు నెమ్మదించేలా, పక్క నుంచి వెళ్లేలా 200 మీటర్ల దూరంలో రబ్బరకోన్లు ఏర్పాట్లు చేయాలి. సిబ్బంది ఎరుపు జెండా పట్టుకొని వాహనాల చోదకులను అప్రమత్తం చేయాలి. రహదారి మధ్యలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు నిలిపి పని చేసే సమయంలో ఆ దిశగా వచ్చే వాహన చోదకులకు స్పష్టంగా కనిపించేలా దూరంలోనే హెచ్చరిక, సూచన బోర్డు ఏర్పాటు చేయాలి. కూలీలు పనిచేసేటప్పుడు ఎరుపు రంగు ఆఫ్రాన్‌ ధరించాలి. పనులు చేస్తున్న వాహనం చుట్టూ రబ్బరు కోన్లు అమర్చాలి.


ప్రమాదాల నివారణ చర్యలేవి..

రహదారిపై కూలీలతో పనులు చేయిస్తున్న సమయంలో గుత్తేదారు, అధికారులు సాధారణ నిబంధనలను విస్మరిస్తున్నారు. విభాగిని మధ్యలోని మొక్కలకు నీళ్లు పోయడం, వాటి సంరక్షణ చర్యలు చేపట్టడం వంటి పనుల క్రమంలో రహదారి వెంట వెళ్లే వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. మొక్కలకు నీళ్లు పట్టడానికి ట్యాంకర్‌ కాకుండా బిందుసేద్యం లాంటి పద్ధతులు పాటించే అవకాశమున్నా ఆ దిశగా ఆలోచించడం లేదు.


ట్రాక్టరు, లారీ ఢీ.. ఇద్దరు మహిళల మృతి

ఆకుపాముల (మునగాల గ్రామీణం), న్యూస్‌టుడే: జీవనోపాధికి వెళ్లిన కూలీలు పని చేస్తుండగా లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయరహదారి-65పై శనివారం జరిగింది. స్థానికులు, ఎస్సై పి.లోకేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం రామాపురానికి చెందినవారు జాతీయ రహదారిపై జీఎమ్మార్‌ సంస్థలో కూలీలుగా పనులు చేస్తున్నారు. ఆకుపాముల వద్ద ఎనిమిది మంది పని చేస్తున్నారు. ఆకుపాముల శివారులో నిలిపి ఉన్న ట్రాక్టర్‌లోకి కూలీలు చెత్త వేస్తుండగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టడంతో నేలమర్రి వినోద(30) తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. తుమ్మల ధనమ్మ, చెవుల రోశమ్మ, కోదాడ మండలం మంగలితండాకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ దాస్‌లకు తీవ్రగాయాలు కాగా 108లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తుమ్మల ధనమ్మ(55) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. చెవుల రోశమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం ఘటనా స్థలాన్ని ఎసీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేలమర్రి వినోద భర్త తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.లోకేశ్‌ వెల్లడించారు. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్‌ పరారయ్యాడని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఎస్పీ వెంట కోదాడ డీఎసీ వెంకటేశ్వరరెడ్డి, మునగాల సీఐ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.


నేలమర్రి వినోద

తుమ్మల ధనమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని