logo

ఆకాశంలో మబ్బులు.. రైతుల గుండెల్లో గుబులు

ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న వేళ రైతుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఏ క్షణాన గాలి దుమారం వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

ఏపుగా పెరిగి పెద్దగా కంకి ఉన్న వరి పొలం

గరిడేపల్లి (హుజూర్‌నగర్‌), న్యూస్‌టుడే: ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్న వేళ రైతుల గుండెల్లో గుబులు పుడుతోంది. ఏ క్షణాన గాలి దుమారం వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టులో వరికోతకు వచ్చింది. ఈ సమయంలో గాలి దుమారం వస్తే పొలాలు నేలమట్టమవుతాయి. దీంతో తీరని నష్టం వాటిల్లనుంది. సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా కోతకు వచ్చింది. కొన్ని చోట్ల వారం రోజుల క్రితమే వరికోతలు ఆరంభించారు. మిగతా పొలాలన్నీ దాదాపు ఏప్రిల్‌ మొదటి వారం నుంచి చివరి వరకు కోతకు వచ్చేవే ఉన్నాయి. గింజ పాలు పోసుకుంటున్న కొద్దీ వెన్ను బరువుకు దుబ్బు కిందకు వాలుతోంది. ఎత్తుగా పెరిగిన పొలాలు చిన్నపాటి గాలిదుమారానికి పడిపోతున్నాయి. ఏప్రిల్‌ చివరి వరకు వరుణుడు కరుణిస్తే దాదాపు 80 శాతం పంట చేతికి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కానీ శనివారం ఆకాశంలో మబ్బులు రావడంతో ఆందోళనకు గురయ్యారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ మబ్బులు భయపెడుతున్నాయని వాపోతున్నారు. వానాకాలం సరైన దిగుబడులు రాలేదని, ఇపుడు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయనుకుంటున్న తరుణంలో ఆకాశంలో మబ్బులు గుబులు పుట్టిస్తున్నాయని పేర్కొంటున్నారు. గాలిదుమారాలు, వడగండ్ల వానలు రాకపోతే యాసంగి సాగు లాభదాయకమవుతుందని ఆశపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని