logo

సమాజ సేవలో మేముసైతం

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)ను ప్రారంభించారు.

Published : 26 Mar 2023 04:45 IST

జాతీయ శిబిరాల్లోనూ పాల్గొంటున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

సూర్యాపేట ఎస్సీ డిగ్రీ కళాశాల ఆవరణలో చెత్తను తొలగిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు

సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే:

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)ను ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మేముసైతం అంటూ సమాజసేవలో తరిస్తున్నారు. చదువుతోపాటు సామాజిక సేవకు ఉపయోగపడే పలు కార్యక్రమాల్లో పాల్గొని తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏటా నిర్వహించే శిబిరాల్లో రక్తదానం, స్వచ్ఛభారత్‌, శ్రమదానం, హరితహారం, కరోనా సమయంలో అన్నదానం, మాదక ద్రవ్యాల నివారణ, ఓటుహక్కు నమోదు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రజలను చైతన్యపరుస్తారు. తమ కళాశాలలో సైతం ప్రముఖ నాయకుల జయంతి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా బతుకమ్మ సంబురాలు, బాలికా, యోగా దినోత్సవాల నిర్వహణ, కళాశాల ఆవరణను పరిశుభ్రం చేసి చెత్తాచెదారాలను తొలగించి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.

క్రమశిక్షణ అలవడుతోంది

లింగాల నాని, బీఏ తృతీయ సంవత్సరం

ఎస్‌ఎస్‌ఎస్‌తో క్రమశిక్షణ అలవడుతోంది. శిబిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, సామాజిక సమస్యలపై స్పందించడం అలవాటుగా మారుతాయి. ఈ ఏడాది హరియాణాలోని కురుక్షేత్ర యూ నివర్సిటీలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నేషనల్‌ ఇంటిగ్రేషన్‌Â శిబిరానికి హాజరయ్యాను. ఇటీవల నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహించిన జీ20, వై20, ఇంటర్నేషనల్‌ మిలెట్స్‌ ఇయర్‌-2023 శిబిరాల్లోనూ పాల్గొన్నా.

వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు

మేంతబోయిన ఆనంద్‌,బీఎస్సీ తృతీయ సంవత్సరం

ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా సమాజాభివృద్ధికి నావంతు కృషి చేస్తున్నాను. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు.


జాతీయ శిబిరాల్లో మన సంప్రదాయాలు వివరించా

నాగిరెడ్డి పావని, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, తృతీయ సంవత్సరం

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే ఎన్‌ఎస్‌ఎస్‌ ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఇది ఓ వేదికగా నిలుస్తోంది. నేషనల్‌ ఇంటిగ్రేషన్‌లో భాగంగా కర్ణాటకలోని దార్వడ్‌లో గల కర్ణాటక యూనివర్సిటీలో జరిగిన శిబిరానికి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తరపున హాజరయ్యాను. అక్కడ జరిగిన ఏడు రోజుల కార్యక్రమాల్లో మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేశాను. ముఖ్యంగా ఈ శిబిరంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని