logo

ప్రతిపక్షాలపై కక్ష సాధింపు సిగ్గుచేటు: తమ్మినేని

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

కోదాడ: సభలో ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

కోదాడ పట్టణం, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కోదాడ పట్టణంలో శనివారం జనచైతన్య యాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగా థియేటర్‌ ఎదురుగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని ఆరోపించారు. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఈడీల పేరుతో మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. కవితపై లిక్కర్‌ కేసును సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఆయనపై కుట్ర పన్నుతోందన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ నియంతృత్వానికి పరాకాష్ఠ అన్నారు. మునుగోడులో భారాస గెలుపు కమ్యూనిస్టులతోనే సాధ్యమైందన్నారు. భాజపాను ఓడించడానికి సీపీఎం ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ భాజపా పాలనలో దేశంలో అసమానతలు పెరుగుతున్నాయన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, మల్లు లక్ష్మీ, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌ గ్రామీణం: పట్టణానికి జన చైతన్య యాత్ర వచ్చిన సందర్భంగా శనివారం పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నాగారపు పాండు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. భాజపా ఆగడాలను, నియంతృత్వ పోకడలను ప్రజలకు తెలియజేసి గద్దె దించేందుకు యాత్ర సాగిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలే లేకుండా చేయాలని కేంద్రం చేస్తున్న కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిందన్నారు. సీబీఐ దాడులు చేస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను గద్దె దించాలని, దాని కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని