logo

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న ఎలిమినేటి సందీప్‌రెడ్డి, వేదికపై అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నిర్మాణ పనుల ప్రారంభించకపోవడం, గుత్తేదారులతో పనిచేయించుకోలేని స్థితిలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, డీఆర్‌డీఏ సంక్షేమ శాఖల్లో అమలు చేస్తున్న పథకాలు, వాటి అమలుతీరును ఆయన సమీక్షించారు. సమావేశాలకు హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని సూచించారు. సభ్యుడు డాక్టర కుడుదుల నగేష్‌ మాట్లాడుతూ.. సాంకేతిక లోపాలతో, అవగాహన లేకపోవడంతో కొందరు రైతుల ఖాతాల్లో రైతుబంధు, రైతుబీమా పథకాల డబ్బులు జమకావడం లేదని ఆయా అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. తమ మండలాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, రోడ్లపై రోడ్లను తిరిగి నిర్మిస్తున్నారని, రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయడంలేదని ఎంపీపీలు నరాల నిర్మల, రమేష్‌, సభ్యుడు ప్రభాకర్‌రెడ్డిలు పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీసీ రోడ్లలో నాణ్యత లోపిస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా రహదారి నిర్మాణాలు కొనసాగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. మన ఊరు, మన బడి పథకం పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని జడ్పీ ఛైర్మన్‌ కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, సీఈవో కృష్ణారెడ్డి, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా ఆయన ఉద్విగ్నభరితంగా మాట్లాడారు. తన పదవీ కాలంలో ఇదే చివరి సమావేశమన్నారు. ధర్మారెడ్డిపల్లి గ్రామంలో తన నిధులతో నిర్మించిన సామాజిక భవనం తనకు తృప్తిని ఇచ్చిందన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, సీఈవో కృష్ణారెడ్డి, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సభ్యులు ఘనంగా సన్మానించారు.


అధికారులకు వత్తాసు పలుకుతున్నారు...

జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అధికారులకు వత్తాసు పలుకుతున్నారని, తాను అడిగే ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇస్తూ తన స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌ వేదిక ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూసేకరణ, నష్టపరిహారం, పనుల తీరుపై తాను అధికారుల నుంచి సమాధానం కోరిన సందర్భంలో ఛైర్మన్‌ అడ్డు తగులుతూ తానే సమాధానం చెప్పడం సరికాదని సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఈ విషయమై ఛైర్మన్‌, నగేష్‌ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తాను అవకాశం ఇస్తేనే మీరు మాట్లాడాలని ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, నగేష్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రతి సమావేశంలో ఛైర్మన్‌ అధికారులను వెనకవేసుకొస్తున్నారని నగేష్‌ ఆరోపిస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని