logo

అందుబాటులోకి అధునాతన గ్రంథాలయం రూ. 2 కోట్లతో భవన నిర్మాణం

భువనగిరిలోని బాగాయిత్‌ పాఠశాల సమీపంలో నిర్మించిన నూతన జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం సోమవారం ప్రారంభించనున్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనం

భువనగిరిగంజ్‌, న్యూస్‌టుడే: భువనగిరిలోని బాగాయిత్‌ పాఠశాల సమీపంలో నిర్మించిన నూతన జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం సోమవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం పట్టణంలోని మీనానగర్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లను నూతన భవనంలోకి తరలింపు ప్రక్రియను చేపట్టారు. హైదరాబాద్‌లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన కొత్త ఫర్నీచర్‌ను కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి ఇక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవానికి మంత్రులు జగదీష్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డితోపాటు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపించారు.


22 వేల పుస్తకాలు

నూతన గ్రంథాలయ భవన నిర్మించేందుకు 2021 సెప్టెంబరు 8న శంకుస్థాపన చేశారు. రూ.కోటి ఆర్‌ఎల్‌ఎఫ్‌ (రాజారామ్‌మోహన్‌రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌), మరో రూ.కోటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ నుంచి కేటాయించారు.  1815 చదరపు గజాల స్థలంలో రెండు అంతస్థుల భవనం నిర్మించారు. 400 మంది చదువుకునేంందుకు వీలుగా రీడింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. దినపత్రికలకు, పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం రీడింగ్‌ హాల్‌ , ఇతర పుస్తకాలు, మ్యాగ్జిన్స్‌ చదివేవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 22,053 పుస్తకాలు ఉన్నాయి. 1754 మందికి గ్రంథాలయ సభ్యత్వం ఉంది. పుస్తక పఠనంతోపాటు ఇంటర్‌నెట్‌, వైఫై సేవలు అందించేలా తీర్చిదిద్దారు. గ్రంథాలయ ఛైర్మన్‌, గ్రంథాలయ కార్యదర్శి, గ్రంథపాలకుల కోసం విడివిడిగా గదులను నిర్మించారు. మొత్తం భవనం నీటి అవసరాల కోసం 35 వేల లీటర్ల సంపును ఏర్పాటు చేశారు. పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించారు.


ఏర్పాట్లు పూర్తి : సుధీర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

నూతనంగా నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పుస్తక ప్రియులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక వసతులతో భవనం తీర్చిదిద్దాం. పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని