logo

మను ధర్మాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు భాజపా కుట్ర: తమ్మినేని

సమాజానికి చీడ పురుగులాంటి కుల వ్యవస్థను పెంచి పోషించే మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.

Published : 27 Mar 2023 03:16 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: సమాజానికి చీడ పురుగులాంటి కుల వ్యవస్థను పెంచి పోషించే మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో చేర్చేందుకు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. హిందూత్వ రాజ్యాన్ని స్థాపించడమే భాజపా సిద్ధాంతమని, అందులో భాగంగానే దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. భాజపాను వ్యతిరేకించే పార్టీలతో కలిసి నడుస్తామన్నారు. భారాసకు మునుగోడు ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం కానీ.. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సైతం నిలదీస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి మాట్లాడుతూ భారాసతో పొత్తు ఉన్నా..లేకపోయినా వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి సీపీఎం పోటీ చేస్తుందని పేర్కొన్నారు. పోతినేని సుదర్శన్‌ రథసారధిగా చేపట్టిన జనచైతన్య యాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా ఆదివారం మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. 10 రోజులుగా సాగుతున్న జన చైతన్య యాత్ర 1,150 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డబ్బీకార్‌ మల్లేష్‌, సుధాకర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కదం తొక్కిన సీపీఎం శ్రేణులు.. జన చైతన్య యాత్ర ఆదివారం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌గేట్‌ వద్ద జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ద్విచక్రవాహనాల ర్యాలీగా పట్టణంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలు ఎర్ర చొక్కాలు, జెండాలు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. సభా వేదికపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని