logo

ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో అభివృద్ధి: మంత్రి

స్థానిక  సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో గ్రామాలు అద్భుత ప్రగతి సాధించాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 03:16 IST

జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి,

వేదికపై జడ్పీ అధ్యక్షులు బండ నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: స్థానిక  సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో గ్రామాలు అద్భుత ప్రగతి సాధించాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి జాతీయ పంచాయతీ పురస్కారాలు-2023 (దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కారాలు) ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 81 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి జాతీయ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందాయని వివరించారు. దేశంలోని 1.50 లక్షల గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం 20 అవార్డులు ప్రకటిస్తే అందులో  రాష్ట్రంలోని 19 పంచాయతీలు ఉండటం గర్వకారణమని చెప్పారు. ఈ సారి సర్పంచులుగా పని చేసిన వారు అదృష్టవంతులని, నిర్విరామంగా చేసిన పని వల్ల గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో అభివృద్ధి చెందాయని, రహదారులు, పల్లెపకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌లు, ఇతర మౌలిక వసతులు సమకూరినట్లు తెలిపారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో 200 కోట్ల మొక్కలు నాటి పర్యావరణంలో దేశంలోనే తక్కువ కాలంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. సర్పంచులు, కార్యదర్శులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు నిబద్ధతతో చేసిన కృషితో అభివృద్ధి సాధ్యమైందన్నారు. సమష్టి కృషి వల్ల రాష్ట్రం దేశంలోనే సగర్వంగా తలెత్తుకుని అభివృద్ధి సాధించిందని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు సీఎం ముందు చూపునకు నిదర్శనమని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న మాదిరిగా దేశంలో ఏ రాష్ట్రంలో లేవని, 2014కు ముందు గ్రామాలు, ఇప్పటి గ్రామాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్థాయిలో ఉత్తమంగా ఎంపికైన 81 గ్రామ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. 9 ఎంపిక చేసిన అంశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ పురస్కారాలు అందచేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి జిల్లాల సర్పంచులు, కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులకు మొత్తం 81 అవార్డులను మంత్రి అందజేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపిక, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు టి.వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్‌.వెంకటరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఖుష్భూగుప్తా, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, దీపక్‌ తివారి, డీపీవోలు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు