logo

మహిళల ఆరోగ్యానికి భరోసా

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకం ఉమ్మడి జిల్లాలో అతివలకు ఉపయోగకరంగా ఉంది.

Published : 27 Mar 2023 03:16 IST

అందుబాటులోకి ప్రత్యేక వైద్య సేవలు

నల్గొండలోని మాన్యంచెల్క ఆసుపత్రిలో మహిళకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

నల్గొండ అర్బన్‌, సూర్యాపేట (నేరవిభాగం), యాదాద్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య మహిళా పథకం ఉమ్మడి జిల్లాలో అతివలకు ఉపయోగకరంగా ఉంది. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మహిళా వైద్యులతో పాటు సిబ్బంది కూడా మహిళలనే అందుబాటులో ఉంచారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పీసీవోడీ, థైరాయిడ్‌, రక్తపోటు, మధుమేహం, గర్భాశయం, హార్మోన్‌, మూత్రనాళం వంటి సమస్యలకు పరీక్షలు చేస్తున్నారు. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి పరీక్షలకు ఇక్కడి నుంచి రెఫర్‌ చేస్తున్నారు. చికిత్స వివరాలు ఆరోగ్య మహిళా యాప్‌లో నమోదు చేస్తున్నారు.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన మామోగ్రామ్‌ యంత్రం

ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌లే..

జిల్లాలో మహిళా ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ మంది మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ల సమస్యలతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. ఆతర్వాత మామోగ్రామ్‌, థైరాయిడ్‌, వీఐఏ సమస్యలతో బాధపడే వారు ఉంటున్నారు. సూర్యాపేట జిల్లాలో రొమ్ము క్యాన్సర్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడే వారే ఎక్కువ సంఖ్యలో కన్పిస్తున్నారు. వీరికి జిల్లా ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి చికిత్స అందేలా చూస్తున్నారు. ఇతర ఆసుపత్రుల కంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మహిళా వైద్యులు, సిబ్బంది ఉండడంతో వారి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది. తీవ్రస్థాయిలో జబ్బులతో బాధపడే వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రులకు పంపించి చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక పరీక్షలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో కొత్తగా మరికొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8 నుంచి ఈ పరీక్షలను ప్రారంభించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 44 పరీక్షలతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా విటమిన్‌ డీ-3, బీ-12 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గుండె వ్యాధిగ్రస్తులకు 2డీ ఎకో, ఎక్స్‌రే, ఈసీజీ, మామోగ్రామ్‌ పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి.


చెప్పుకునేలా ఉంది 

శ్రీదేవి, మాన్యంచెల్క, నల్గొండ

ఆరోగ్య మహిళా ఆసుపత్రి ద్వారా మహిళలకు ఎక్కువ శాతం మేలు జరుగుతుంది. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే అన్నిరకాల వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు వైద్యులకు, సిబ్బందికి చెప్పుకునే అవకాశం ఉంది. అన్ని రకాల పరీక్షలు చేసి మాత్రలు అందిస్తున్నారు. మరికొంత మంది మహిళా సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది.


మెరుగుపరుస్తున్నాం

డా.అన్నిమళ్ల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్గొండ

ఆరోగ్య మహిళా ఆసుపత్రుల్లో ఓపీ క్రమేణా పెరుగుతోంది. ప్రతి మంగళవారం ఇక్కడ మహిళా వైద్యులతో పాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. బాధితులకు కావాల్సిన  వసతులు కల్పిస్తున్నాం. పరీక్షల కోసం వచ్చేవారి నుంచి రక్త పూతలు సేకరించి టీ హబ్‌ ద్వారా అన్ని రకాల పరీక్షలు చేయించి అదే రోజు వారి చరవాణికి సమాచారం అందేలా చూస్తున్నాం. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు రోగులను పంపిస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు