logo

రాములోరి తలంబ్రాల బుకింగ్‌కు ఆదరణ

ప్రయాణికులకు చేరువ కావడంతో పాటు.. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న ఆర్టీసీ తాజాగా లాజిస్టిక్స్‌ ద్వారా భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేసేందుకు బుకింగ్‌లను ప్రారంభించింది.

Published : 27 Mar 2023 03:16 IST

ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో మిర్యాలగూడ

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణికులకు చేరువ కావడంతో పాటు.. ఆదాయాన్ని పెంచుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న ఆర్టీసీ తాజాగా లాజిస్టిక్స్‌ ద్వారా భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేసేందుకు బుకింగ్‌లను ప్రారంభించింది. కల్యాణానికి వెళ్లలేని భక్తులు కల్యాణ తలంబ్రాలను అందుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలోని లాజిస్టిక్స్‌ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రూ.116 చెల్లించి..తమ వివరాలు నమోదు చేయించుకుని రశీదు పొందితే ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలను అందించనుంది.

చిట్యాల మండలం నేరడ గ్రామంలో తలంబ్రాల బుకింగ్‌ రసీదు అందిస్తున్న కార్గో సిబ్బంది

వారంలో 2,695 బుకింగ్‌లు..

ఉమ్మడి జిల్లాలో ఈ నెల 17న తలంబ్రాల కోసం బుకింగ్‌లు ప్రారంభించారు. వారం రోజుల్లోనే 2,695 బుకింగ్‌లు నమోదు కాగా..రూ.3,12,620 ఆదాయం వచ్చింది. బుకింగ్‌లకు ఈ నెల 30 వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో 513 బుకింగ్‌లతో మిర్యాలగూడ ప్రథమ స్థానంలో నిలవగా...ఆ తర్వాత స్థానంలో 499 బుకింగ్‌లతో సూర్యాపేట డిపో ఉంది. 254 బుకింగ్‌లతో నార్కట్‌పల్లి డిపో చివరి స్థానంలో ఉంది.


ఆదరణ బాగుంది

రవీందర్‌, రీజినల్‌ లాజిస్టిక్స్‌ అధికారి, నల్గొండ

రాములోరి తలంబ్రాల పంపిణీ బుకింగ్‌లకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ప్రజలు, భక్తులు తమ సమీపంలో డిపో లాజిస్టిక్స్‌ కార్యాలయాలు, డీఎంఈలు, ఏజెంట్లు, ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించి తమ పూర్తి వివరాలు తెలిపి..బుకింగ్‌ చేసుకుని రసీదు పొందొచ్చు. ఈ నెల 30 వరకు బుకింగ్‌కు అవకాశం ఉంది. బుకింగ్‌ చేసుకున్న వారి ఇంటి వద్దకే తలంబ్రాలను పంపిణీ చేస్తాం. డిపో మార్కెటింగ్‌ సిబ్బంది ఫోన్‌ నంబర్‌కు ఆన్‌లైన్‌ ద్వారా నగదు చెల్లించి సైతం బుకింగ్‌ చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని