logo

తెరపడే నాటకరంగానికి జీవం

తెలుగు నాటక రంగం తెరమరుగైపోతోంది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది.

Published : 27 Mar 2023 03:16 IST

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రణయ్‌రాజ్‌ వంగరి బృందం ప్రదర్శించిన ఆధునిక నాటకంలో ఓ సన్నివేశం

మోత్కూరు, న్యూస్‌టుడే: తెలుగు నాటక రంగం తెరమరుగైపోతోంది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. నాటక సమాజాలను ఆదరించే వారు లేక, ఆర్థిక వనరులు లేక మూతపడిపోతున్నాయి. దివిటీలు పెట్టి నాటకాలు ఆడిన రోజులు గతం. ప్రజల వినోదం కోసం కాకుండా అప్పటి ఉద్యమాలను ప్రచారం చేసి, జనాలను ఉత్తేజపరిచే లక్ష్యంతో నాటకాలు ప్రదర్శించేవారు. బుర్రకథ, హరికథ, జముకులకథ, భజన, కోలాటం, సుద్దులు, యక్షగానాలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు ఇలా ఎన్నో తెలుగు నాటక రంగంలో కీలక భూమిక పోషించాయి. నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

ఆ నాటకాలేవి?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1984 వరకు ఔత్సాహిక నటక రంగానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. ఎన్నో సంస్థలు ఈ రంగానికి సేవ చేశాయి. సూర్యాపేటలో పబ్లిక్‌ క్లబ్‌ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ పోటీలకు దేశం నలుమూలల నుంచి పలు సంస్థలు పాల్గొన్నాయి. తెలంగాణలో హైదారాబాద్‌ మినహా ఔత్సాహిక నాటక రంగానికి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపింది నల్గొండ జిల్లాయే. నాడు గ్రామాల్లో నాట్య కళామండలి పేర్లతో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి డ్రెస్సులు, సామగ్రి తెప్పించుకునేవారు. కురుక్షేత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీసీతారామకల్యాణం, శ్రీకృష్ణరాయభారం, లవకుశ, సత్యహరిశ్చంద్ర లాంటి ఇతిహాసాలను ప్రజల కళ్లకద్దేవారు. నేడు ఆ కళాకారులు, వీధి భాగవతాలు, దాసరి, చిందు, యాక్షగాన కళాకారులు ఎక్కడో ఒకచోట ప్రదర్శించినా... ఆదరించేవారు కరవై దాన్ని వదులుకొని ఇతర వృత్తులపై జీవిస్తున్నారు.

జీవం పోస్తున్న సమాజాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలుగు నాటకరంగానికి జీవం పోస్తున్న సమాజాలు కొన్ని ఉన్నాయి. మిర్యాలగూడలో 14 సమాజాలన్నీ కలిసి ‘మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం’గా ఏర్పడి 1994 నుంచి తెలుగు సాంఘిక, పద్య నాటకాలను రాష్ట్రం నలుమూలాల ప్రదర్శిస్తున్నాయి. ఇందులో సుమారు 500 మంది కళాకారులున్నారు. నల్గొండలో కోమలి కళాసమితి కళాకారులు తెలుగు నాటకాన్ని ప్రజలు మరిచిపోకుండా రక్షిస్తున్నారు. నల్గొండలో ‘జేపీ ఆర్ట్స్‌ థియేటర్స్‌’, రసరమ్య తదితర సంస్థలూ అప్పుడప్పుడు తెలుగు నాటకాలను ప్రదర్శించి నాటకాభిమానులను అలరిస్తున్నాయి.


మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాలి

ప్రణయ్‌రాజ్‌ వంగరి, నటుడు, నాటకరంగ పరిశోధకుడు, మోత్కూరు

పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, మండల స్థాయిలో నాటక కార్యశాలలు ఏర్పాటు చేసి, శిక్షణతోపాటు ప్రదర్శనలు ఇప్పించాలి. సర్వశిక్ష అభియాన్‌ పరిధిలోని పాఠశాలల్లో రంగస్థల విద్యను ప్రవేశపెట్టి వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆ విద్యను చదివిన వారికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలి.


విద్యార్థులను నృత్యాలకు పరిమితం చేయొద్దు

అభినయ శ్రీనివాస్‌, సినీగీత, నాటక రచయిత మోత్కూరు

సినిమా, టీవీ ప్రభావం ఎంతగా ఉన్నప్పటికీ నాటక ప్రదర్శనలు చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. తమ సంస్థ అభినయ కళాసమితి ఆధ్వర్యంలో ఏటా సాంస్కృతికోత్సవాలు, నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. పాఠశాలల్లో విద్యార్థులను నృత్యాలకే పరిమితం చేస్తున్నారు. వారితో నాటికలు వేయించాలి. నాటక పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి.


గ్రామీణ కళాకారులను ప్రోత్సహించాలి

గుంటి పిచ్చయ్య, నటుడు, దర్శకుడు, మఠంపల్లి

విద్యార్థి దశ నుంచి మొదలుకొని 40 ఏళ్లుగా ఈ రంగంలో కృషిచేస్తున్నాను. 1998లో యువభారతి సాహితీ, సాంస్కృతిక కళాసమితిని ఏర్పాటు చేసి నేటికీ పద్య, సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తున్నాం. సాంఘిక, పౌరాణిక, పద్య నాటకాలు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించి పురస్కారాలు, సన్మానాలు అందుకున్నా. తెలుగు నాటకరంగ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించాలి. గ్రామీణ కళాకారులు, సంస్థలను ప్రోత్సహించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని