logo

నిర్లక్ష్యమే ప్రాణం తీస్తోంది..!

జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై ప్రయాణించిన వారే మృత్యువాత పడుతున్న విషాద ఘటనలు నిత్యం ఏదో ఒక చోటు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Published : 27 Mar 2023 03:16 IST

ద్విచక్ర వాహనదారుల అజాగ్రత్తతో అధిక ప్రమాదాలు
సూర్యాపేట జిల్లాలో మూడేళ్లలో 373 మంది మృతి
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే

జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై ప్రయాణించిన వారే మృత్యువాత పడుతున్న విషాద ఘటనలు నిత్యం ఏదో ఒక చోటు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువ శాతం మంది యువకులే ఉంటున్నారు. కొంత మంది ముక్కుపచ్చలారని పిల్లలు సైతం ప్రాణాలు కోల్పోతుండటం తల్లిదండ్రులను కలచివేస్తోంది. సూర్యాపేట జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాల తీవ్రతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..

61 శాతానికిపైగా మృతులు

ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లోనే అధిక శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడేళ్లలో మొత్తం 1,441 ప్రమాదాలు జరుగగా.. వాటిల్లో 612 మంది మరణించారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 667 ఉండగా.. 373 మంది ప్రాణాలు కోల్పోవటం గమనార్హం. అంటే గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ద్విచక్ర వాహనదారుల మరణాల శాతం 61గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కారణాలు ఇవే..

నిర్లక్షమే రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించకూడదన్న నిబంధన ఉంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. కానీ, కొంత మంది ఒకే వాహనంపై ఏకంగా ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి రాకపోకలు సాగిస్తున్నారు. బైక్‌పై ఎక్కువ మంది కూర్చొని వెళ్లడం వల్ల ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తప్పించడం సాధ్యం కాదు. వాహనం అదుపులోకి రాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొంత మంది మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడుపుతూ వారు మరణిస్తూ ఇతరుల ప్రాణాలనూ బలిగొంటున్నారు. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదాలకు గురైతే బాధితులకు బీమా లభించదని పోలీసులు ఓ వైపు హెచ్చరిస్తున్నారు. కానీ, పాటించేవారు కరవు. ఈ విషయంలో వాహనదారులు స్వీయ నిబంధనలు పాటించాలి. పోలీసులు ఈ మేరకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.


విధిగా శిరస్త్రాణం ధరించాలి

రాజేంద్రప్రసాద్‌, ఎస్పీ, సూర్యాపేట

వాహనాలు నడిపే సమయంలో అజాగ్రత్త వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారకులు, మృతులు ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ఉంటున్నారు. బైక్‌ నడిపేటప్పుడు విధిగా శిరస్త్రాణం ధరించాలి. ఇద్దరికి మించి ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు పిల్లలకు బైకులు ఇవ్వొద్దు. వాటిపై ఇద్దరికి మించి ప్రయాణించినప్పుడు, మద్యం తాగినప్పుడు ప్రమాదం చోటుచేసుకుంటే బీమా వర్తించదు. దీనిపై వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని