logo

బియ్యం ఎప్పుడిస్తారో..!

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సేకరణ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31 వరకు సీఎంఆర్‌ సేకరణ పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది

Updated : 30 Mar 2023 05:44 IST

  ఈ నెల 31లోపు సీఎంఆర్‌ పూర్తి చేయాలన్న కేంద్రం
సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్‌లోనూ నత్తనడకన సేకరణ
ఈనాడు, నల్గొండ

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) సేకరణ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31 వరకు సీఎంఆర్‌ సేకరణ పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండించే జిల్లాలైన నల్గొండ, సూర్యాపేటల్లో సీఎంఆర్‌ సేకరణపై అధికారులు నిత్యం సమీక్షలు చేస్తున్నారు. 2021 - 22  యాసంగి సీజన్‌కు సంబంధించి నల్గొండ జిల్లాలో సుమారు 94 శాతం మేర సీఎంఆర్‌ను పూర్తి చేయగా..యాదాద్రి జిల్లాలో అది 90 శాతం మేర పూర్తయింది. ఈ సీజన్‌లోనూ సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్‌ సేకరణ 60 శాతం కూడా దాటలేదు. 2022 వానాకాలం సీజన్‌కు సంబంధించి సైతం నల్గొండ జిల్లాలో అప్పుడే 40 శాతం మేర మిల్లింగ్‌ పూర్తయింది. యాదాద్రి జిల్లాలో అది 22 శాతంగా ఉంది. కానీ సూర్యాపేట జిల్లాలో మాత్రం గత నాలుగైదు సీజన్లుగా ఎఫ్‌సీఐ లక్ష్యాన్ని చేరకపోవడం గమనార్హం. మితిమీరిన రాజకీయ జోక్యం, అధికారులు, మిల్లర్లు కలిసి ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం తదితర కారణాలతోనే సూర్యాపేట జిల్లాలో సేకరణ లక్ష్యం చేరడం లేదని సంబంధిత వర్గాల తెలిసింది.

అధికారుల అలసత్వం.. మిల్లర్ల మాయాజాలం

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం (సీఎంఆర్‌) పక్కదారి పట్టించిన ఆరు మిల్లులపై గతంలోనే పౌరసరఫరాల శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు వాటిపై చర్యలు తీసుకోలేదు. అక్రమాలకు పాల్పడిన మిల్లులన్నీ అత్యధికం తుంగతుర్తి నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. అయితే జిల్లా స్థాయిలో ఓ ఉన్నతాధికారి ప్రోత్సాహం వల్లే మిల్లర్లు ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంట్లున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సదరు అధికారి నిర్వాకం వల్లే గత నాలుగు సీజన్లుగా జిల్లా సేకరణ లక్ష్యం 75 శాతాన్ని మించకపోవడం గమనార్హం. ఇటీవలే నిఘా వర్గాలు సైతం అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లతో పాటూ వీరికి సహకరిస్తున్న పలువురు జిల్లా అధికారులపై సమగ్ర నివేదిక పంపించినట్లు తెలిసింది. అయితే ఇటీవల జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్‌రావు ఇటీవలే ఎఫ్‌సీఐ, మిల్లర్లతో సమావేశమై సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిల్లర్లందరూ ఎఫ్‌సీఐకి గడువులోపు సీఎంఆర్‌ను అప్పగించాలని ఆదేశించారు.

నాణ్యతపై ఎఫ్‌సీఐ కొర్రీలు

మరోవైపు మిల్లర్ల నుంచి సేకరిస్తున్న బియ్యంలో నాణ్యత ఉండటం లేదని కొన్ని సార్లు ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 94 శాతం మేర సీఎంఆర్‌ లక్ష్యం పూర్తి కాగా.. మిల్లింగ్‌ అయిన బియ్యాన్ని సకాలంలో తీసుకోవడంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తగిన చొరవ చూపడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. తగిన సమయంలో ర్యాక్‌లు (రైళ్లు) రాకపోవడంతో మిల్లుల్లో నిల్వలు పేరుకుపోతున్నాయని..సకాలంలో బియ్యాన్ని అన్‌లోడ్‌ చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కోరితే..వారు నాణ్యతగా ఉండటం లేదని చెబుతూ ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారు. మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు మిల్లుల నుంచి ఖాళీ చేస్తే ఇటీవల ముగిసిన వానాకాలం సీజన్‌లోని ధాన్యం సైతం ప్రభుత్వానికి అప్పజెబుతామని నల్గొండ జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చిట్టిప్రోలు యాదగిరి ‘ఈనాడు’కు వెల్లడించారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలోనే సీఎంఆర్‌ కేంద్రానికి అప్పజెప్పడంలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని వెల్లడించారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..

సీఎంఆర్‌ లక్ష్యాన్ని గడువులోపు ఇవ్వాలని ఇటీవలే మిల్లర్లందరికీ స్పష్టం చేశాం. సీఎంఆర్‌ ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి సహాయపడే అధికారులపైనా వేటు వేస్తాం.
ఎస్‌.వెంకటరావు, కలెక్టరు, సూర్యాపేట


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని