logo

పుర పద్దుకు..పొద్దు పొడిచె

నల్గొండ మున్సిపాలిటీ 2023-24 వార్షిక బడ్జెట్‌ను రూ.784 కోట్లతో బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి ప్రవేశపెట్టారు.

Published : 30 Mar 2023 04:06 IST

 కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎం కౌన్సిలర్ల గైర్హాజరు

మాట్లాడుతున్న ఛైర్మన్‌ సైదిరెడ్డి, చిత్రంలో అదనపు కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, కమిషనర్‌ రమణాచారి

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండ మున్సిపాలిటీ 2023-24 వార్షిక బడ్జెట్‌ను రూ.784 కోట్లతో బుధవారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి ప్రవేశపెట్టారు. అభివృద్ధి పనులకు, పారిశుద్ధ్యానికి పెద్దపీˆట వేశారు. 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు పోగా, 8 శాతం నిధులు వేతనాలకు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఎస్‌డీఎఫ్‌, టీయుఎఫ్‌ఐడీసీˆ, అమృత్‌-2 నిధులను గ్రాంట్ల రూపంలో చూపించారు.  

ప్రతిపక్షాల  గైర్హాజరు

నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు ఉండగా,, బడ్జెట్‌ సమావేశానికి 21 మంది మాత్రమే హాజరయ్యారు.  కాంగ్రెస్‌- 18, భాజపా-6, ఎంఐఎం-1 చొప్పున కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉండగా.. అధికార భారాస నుంచి పిల్లి రామరాజు, జేరిపోతుల అశ్విని సమావేశానికి రాలేదు.

ఆమోదంపై అయోమయం!

నల్గొండ మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్‌ ఆమోదంపై అయోమయం నెలకొంది. బుధవారం పుర ఛైర్మన్‌ సైదిరెడ్డి బడ్జెట్‌ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. కౌన్సిల్‌ సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని.. అందులో 17 మంది అంగీకారం లభిస్తే 2019 మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఆమోదం పొందినట్లే అని పుర కమిషనర్‌ రమణాచారి తెలిపారు. భాజపా, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మాత్రం 2019 మున్సిపాలిటీ చట్టానికి గవర్నర్‌ ఆమోదం(అమైన్‌మెంటు) లభించనప్పుడు అది ఎలా అమల్లోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అదనపు కలెక్టరు ఖుష్భూగుప్తా, వైస్‌ ఛైర్మన్‌ రమేష్‌గౌడ్‌  పాల్గొన్నారు.కౌన్సిల్‌ను నిర్వీర్యం చేస్తున్న యంత్రాంగం
నల్గొండ మున్సిపాలిటీ యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు కౌన్సిల్‌ను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనే తాము బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించామని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ వేణు అన్నారు. మున్సిపాలిటీ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో 18 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు సమావేశం అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రూ.వందల కోట్లలో నిధులు బడ్జెట్‌లో చూపిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పనులకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ అమల్లోకి తీసుకురాకుండా పూర్తిగా విఫలం అయ్యారన్నారు.  

నిధుల కేటాయింపులో వివక్ష

నీలగిరి: అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం జరిగిన బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించామని భాజపా పురపాలిక ప్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వార్డులలో సమస్యలు పెరుగుతున్నా నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ వెనక్కి తీసుకుని ప్రభుత్వ భూములలో ఇండస్ట్రీయల్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.భాజపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని