logo

ఒక్కో కుటుంబంలో.. ఒకటికి మించి..!

ఈ రోజుల్లో.. ఏదో ఒక్క వాహనం లేని ఇల్లు కనిపించదు. రోజురోజుకు వాహనాల అవసరం, వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పేదవాడి వాహనం అనగానే సైకిల్‌ గుర్తుచ్చేది.

Published : 30 Mar 2023 04:06 IST

  ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న వాహనాల విక్రయాలు, వినియోగం

   -కోదాడ న్యూస్‌టుడే

ఈ రోజుల్లో.. ఏదో ఒక్క వాహనం లేని ఇల్లు కనిపించదు. రోజురోజుకు వాహనాల అవసరం, వినియోగం పెరుగుతూనే ఉన్నాయి. గతంలో పేదవాడి వాహనం అనగానే సైకిల్‌ గుర్తుచ్చేది. ఇప్పుడు ద్విచక్ర వాహనమే గుర్తుస్తోంది. ఈ నేపథ్యంలో.. కుటుంబాల కంటే వాహనాలే ఎక్కువగా ఉండడం విశేషం. 

గత పదేళ్ల కాలంలో జిల్లాలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 లక్షల కుటుంబాలు ఉండగా, సుమారు 12 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 70 శాతం అనగా 8 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. తర్వాతి  స్థానంలో వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, కార్లు ఉన్నాయి. కారు, ట్రాక్టర్‌, ఇతర వాహనాలు ఉన్న ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరిగా ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని వారు సొంతంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు.

నల్గొండలో ఎక్కువ.. మిగతా చోట్ల తక్కువ

ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిలాల్లో సుమారు 5 లక్షల కుటుంబాలు ఉండగా.. 6 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, లారీలు ఉన్నాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కుటుంబాల సంఖ్య కంటే వాహనాల సంఖ్య తక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కుటుంబాల కంటే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో యాదాద్రి జిల్లాలో ప్రజలు వాహనాలు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలు తక్కువే..

జిల్లాలో ఎలక్ట్రిక్‌ వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 లోపే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ వాహనాలపై విధించే పన్నులపై రాయితీలు ఇస్తున్నా.. మార్కెట్లో ఎక్కువగా ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదు.  

రవాణా శాఖ ఖజానాకు భారీగా ఆదాయం

2014లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ద్వారా రూ.50 కోట్ల ఆదాయం దాటకపోయేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సుమారు రూ.300 కోట్ల ఆదాయం ఆ శాఖ నుంచే వస్తుంది. వాహనాల క్రయవిక్రయాలు పెరగడంతో పాటు, రిజిస్ట్రేషన్‌ ధరలు కూడా ప్రభుత్వం పెంచడంతో ఆదాయం దండిగా వస్తుంది. రవాణాశాఖ లైఫ్‌ ట్యాక్స్‌, క్వార్టర్‌ ట్యాక్స్‌, యూజర్‌ ట్యాక్స్‌ల ద్వారా పన్నులు వసూలు చేస్తోంది. వీటిలో లైఫ్‌ ట్యాక్స్‌ ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది.


విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి
- వెంకట్‌రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి. సూర్యాపేట

గత కొన్నేళ్ల నుంచి వాహనాలు విక్రయాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఇంటిలో ఒక వాహనం తప్పనిసరిగా ఉంది. రాబోయే రోజుల్లో కార్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని