logo

అదిగదిగో.. రెండో భద్రాద్రి

రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరొందిన నూతనకల్‌ మండలం మిర్యాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది.

Published : 30 Mar 2023 04:17 IST

  మిర్యాలలో శ్రీరామ నవమి
ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం

మిర్యాలలో రామాయణం, మహాభారతం ఘట్టాలను తెలియజేసే 80 అడుగుల గాలిగోపురం

నూతనకల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరొందిన నూతనకల్‌ మండలం మిర్యాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. పలక రామచంద్రుడు, సంతాన రాముడిగా పేరొందిన స్వామివారి కల్యాణోత్సవాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు. వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.

చరిత్ర.. ప్రత్యేకతలు

శ్రీఖర మహర్షి శ్రీరాముడి కోసం పలకపై రామకోటి రాస్తూ తపస్సు చేయగా పలకపై స్వామివారు ప్రత్యక్షమయ్యాడని, అప్పటి నుంచి పలక రామచంద్రుడిగా పేరొందారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయంలో పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తారు. అయోధ్య నుంచి అరణ్యవాసం కోసం వెళ్తున్న సీతాసమేత రామలక్ష్మణులు ఆలయ ప్రాంతంలో సేదదీరడంతో కాకతీయుల కాలంలో ఆలయం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. మహాభారతం, రామాయణం ఇతిహాసాలను తెలియజేసే శిల్పాలతో కూడిన 80 అడుగుల గాలిగోపురం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రావణుడిని సంహరించేందుకు ఆంజనేయుడు తన భుజాలపై రామలక్ష్మణులను మోసుకెళ్తూ సముద్రాన్ని దాటే శిల్పం ఆకట్టుకుంటుంది.  కౌరవులు, పాండవుల యుద్ధ సన్నివేశాలు, శ్రీమహావిష్ణువు, గరుత్మంతుడి విశ్వరూపం శిల్పాలు కనువిందు చేస్తాయి.
*   గతంలో శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో కల్యాణం జరుగుతున్న సమయంలో ఈ ఆలయంలో అక్షింతలు పచ్చగా మారేవని స్థానికులు చెబుతున్నారు. తలంబ్రాలను మిర్యాల గ్రామస్థులు తమ ఇళ్లలోని ధాన్యగారాలు, దేవుడి పూజ గదిలో ఉంచుకొంటారు. పెళ్లి కాని యువతులు, యువకులు స్వామివారి కల్యాణోత్సవాల్లో పాల్గొని సేవలు చేస్తే ఏడాదిలోగా వివాహాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. గరుడ ముద్ద తిన్న దంపతులకు సంతానం కల్గుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉండటంతో స్వామివారిని సంతాన రాముడిగా కొలుస్తారు.


ఏర్పాట్లు పూర్తి చేశాం
-కనకటి పల్ల వెంకన్న, ఆలయ ఛైర్మన్‌, మిర్యాల

శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలు, చలువ పందిళ్లు, మంచినీటి వసతి, చిన్నారులు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అన్నదాన కార్యక్రమాలు చేపడుతాం. సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించనున్నాం.


ఉత్సవాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలు


ఈ నెల 30న: శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణం
31న: గరుడ సేవ, ధ్వజస్తంభ ఆహ్వానం, గరుడ ముద్ద సమర్పణ
ఏప్రిల్‌ 1న: రథోత్సవం
2న: ఎడ్లబండ్లతో రైతుల ప్రదక్షిణ
3న: పొన్నసేవ
4న: దోపోత్సవం
5న: నగర సంకీర్తన
6న: ఉత్సవ విగ్రహాల యథాస్థాన పూజలు
7న: పునఃప్రతిష్ఠ, ఆలయ ప్రవేశం
8న: ముగింపు ఉత్సవాలు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని