logo

సమయం పాటించక.. అయోమయం

మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అధికారులు సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడూ ఇస్తారో..తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 31 Mar 2023 06:20 IST

  మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో వేళలు పాటించని అధికారులు

సూర్యాపేటలోని శాంతినగర్‌లో పట్టణానికి నీరందించే మిషన్‌ భగీరథ ట్యాంకు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అధికారులు సమయపాలన పాటించడం లేదు. ఎప్పుడూ ఇస్తారో..తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడిచ్చినా..ఒకే సమయానికి ఇవ్వకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లినవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉదయం..సాయంత్రం కాకుండా వారికి ఇష్టమైన సమయంలో సరఫరా చేస్తున్నారు. దీంతో నీటిని పట్టుకొనేందుకు పట్టణవాసులు నరకయాతన పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో 1,28,458 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పురపాలికల్లో 65 శాతం మంది నల్లాలు, 35 శాతం బోర్లపై ఆధారపడుతున్నారు. గతంలో ప్రతి పురపాలికలో నీటి సరఫరాలో వేళలు ప్రకటించే వారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తుండటంతో పంపిణీ సమయాన్ని విస్మరించారు. రోజు విడిచి రోజు ఇస్తున్నారు. వీటికి కూడా ఓ సమయం అనేది ఉండదు. రాత్రి కూడా పంపిణీ చేస్తున్నారు. గతంలో వార్డులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సరఫరా జరిగేది. ప్రస్తుతం సమయాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా సరఫరా జరుగుతోంది. ఉద్యోగులు, వివిధ పనులకు వెళ్లేవారు నీరు సమయానికి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కానీ, సాయంత్రం కాని సరఫరా చేస్తే నీటిని పట్టుకొనే వెసులుబాటు ఉంటుంది. ఎటూకాని సమయం మధ్యాహ్నం, రాత్రి ఇస్తుండటంతో నీటిని పట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పనులు ముగించుకొని వచ్చిన తర్వాత తాగునీటిని పట్టుకుందామని ట్యాంకుల దగ్గరకు వెళ్తే అప్పటికే నీరు వచ్చిపోతోంది.

వృథాగా పోతున్న నీరు

మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో సమయ పాలన లేకపోవడంతో నీరు వృథా అవుతోంది. ఉదయం 9 గంటలకే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ పనులు చేసేవారు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటారు. నీటి పంపిణీ సమయంలో ఇంటి వద్ద ఉండకపోవడంతో ట్యాంకులు నిండి నీరు వృథా అవుతోంది. ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తర్వాత, లేకుంటే రాత్రి 10 గంటలకు సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో ప్రజలు రాత్రి 10 గంటలకే నిద్రపోతుండటంతో ట్యాంకులు నిండి రోడ్లపై పారుతున్నాయి.


వేళలు కేటాయిస్తే మేలు

మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు సరఫరా వేళలు కేటాయించాలి. ఉదయం, సాయంత్రం సమయం కేటాయించి సరఫరా చేయాలి. దీంతో వివిధ పనులకు వెళ్లిన వారు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉదయం 6 గంటలకు సరఫరా చేస్తే నీటిని పట్టుకొని ఉద్యోగులు, వివిధ పనులకు వెళ్లేవారికి సౌలభ్యంగా ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు సరఫరా చేసినా ఉపయుక్తంగా ఉటుంది. ఇప్పటికైనా అధికారులు పురపాలికల్లో నీటి సరఫరా వేళలు పాటించాలని పలువురు కోరుతున్నారు.


ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తాం
-వరుణ్‌, మున్సిపల్‌ ఏఈ, సూర్యాపేట

మిషన్‌ భగీరథ నీటి సరఫరా వేళల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు నీటి పంపిణీలో సమయ వేళలు పాటిస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు