logo

కారణం ఏదైనా.. కాలుతోంది బస్సు

రెండు బస్సులు ఇతర డిపోలకు చెందినవే అయినప్పటికీ.. ఘటనలు ఉమ్మడి జిల్లాలో వరుసగా జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.

Published : 31 Mar 2023 04:39 IST

వరుస ఘటనలతో ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా

మునగాల మండలం ఇందిరానగర్‌లో రాజధాని బస్సు నుంచి భారీగా వెలువడుతున్న పొగ

* ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రయాణికులను వేరే బస్సులో పంపించిన డ్రైవర్‌..బస్సుకు మరమ్మతులు చేపట్టి సూర్యాపేట డిపోకు తరలిస్తుండగా..మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది.      ఆర్టీసీకి సుమారు రూ.25 లక్షల నష్టం వాటిల్లింది.  


*  ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద హైదరాబాద్‌ మియాపూర్‌ డిపోకు చెందిన రాజధాని బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా.. బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలోనూ ఆర్టీసీకి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. హైదరాబాద్‌ నగరంలో నడిచే మెట్రో లగ్జరీ బస్సుకు బాడీ మార్చి రాజధాని బస్సుగా మార్చినట్లు సమాచారం.


మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: రెండు బస్సులు ఇతర డిపోలకు చెందినవే అయినప్పటికీ.. ఘటనలు ఉమ్మడి జిల్లాలో వరుసగా జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. రెండు బస్సులు రాజధాని ఏసీ బస్సులే కావడంతో.. అసలు ప్రమాదాలకు గల కారణాలను ‘న్యూస్‌టుడే’ నిపుణులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో గతంలో మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ డిపోల్లో రాజధాని బస్సులు ఉండేవి. ప్రస్తుతం ఒక్క మిర్యాలగూడ డిపోలోనే మూడు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఇతర డిపోలకు చెందిన రాజధాని బస్సులు ఉమ్మడి జిల్లా నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రయాణిస్తూనే ఉంటాయి.


కొత్త బస్సులూ సెన్సర్లతోనే..

కాగా ఇటీవల ఉమ్మడి జిల్లాకు 25 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు వచ్చాయి. ఇవన్నీ బీఎస్‌-6 వాహనాలు. వీటిలో సుమారు 30కి పైగా సెన్సర్లు ఉంటాయి. ఈ సెన్సర్లు పని చేయడానికి అనేక విద్యుత్తు తీగలు అమరుస్తారు. వీటిని తరచూ తనిఖీ చేయకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇందులో ఫైర్‌ అలారంతో పాటు అగ్ని నివారణ పరికరం అందుబాటులో ఉంది. బస్సులో ఏ భాగంలోనైనా మంటలు చెలరేగితే తక్షణమే అలారం ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. దీంతో ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. మరో వైపు మంటల ఆర్పేందుకు ప్రత్యేక పరికరం, అత్యవసర ద్వారం వద్ద అద్దాన్ని పగులగొట్టేందుకు సుత్తి వంటి ఆయుధాన్ని సైతం అందుబాటులో ఉంచారు.


పలు సూచనలు పాటించాలి..

బస్సుల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదాలను గుర్తించేందుకు డ్రైవర్లకు సంపూర్ణ అవగాహన కల్పించాలి. దీంతో పాటు కొత్త బస్సుల తరహాలో ఫైర్‌ సెన్సర్‌ అలారం, మంటలను ఆర్పే పరికరాలు ఏర్పాటు చేయాలి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం అక్కడికి బస్సులకు ఎడమ వైపు ద్వారంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు కుడి వైపు సైతం మరో ద్వారాన్ని తప్పని సరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని మన బస్సుల్లోనూ అమలు చేస్తే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు ప్రతి రోజు బస్సులో వైరింగ్‌ను తప్పని సరిగా తనిఖీ చేయాలి.


తనిఖీ చేసి పంపిస్తాం..

- శేఖర్‌, మెకానిక్‌, మిర్యాలగూడ డిపో

బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తనిఖీ చేస్తాం. రాజధాని బస్సుల్లో సాధారణ బస్సుల్లో కంటే అధికంగా విద్యుత్తు తీగలు ఉంటాయి. వీటిలో ఏదో ఒక తీగకు తొడుగు తొలగిపోయి..రాపిడి జరిగినప్పుడు మంటలు చెలరేగే అవకాశం ఉంది. ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఏసీ గ్యాస్‌ వల్ల ప్రమాదం జరిగే  అవకాశం లేదు.


రాజధానిలోనే ఎందుకు..

ఆర్టీసీ బస్సులకు తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఏసీ బస్సుల్లోనే ఎందుకు మంటలు వ్యాప్తిస్తున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏసీ బస్సుల్లో వివిధ పనులు విద్యుత్తు ఆధారంగా పని చేస్తాయి. దీంతో సాధారణ బస్సుల్లో కంటే ఈ బస్సుల్లో విద్యుత్తు తీగలు అధికంగా ఉంటాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో తీగలపై తొడుగు తొలగిపోయి..లోపలి తీగల రాపిడితో మంటలు చెలరేగే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన సూర్యాపేట ఘటనలో ఇదే జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మునగాల వద్ద జరిగిన ఘటనలో మాత్రం ద్విచక్ర వాహనం బస్సు కిందికి దూసుకెళ్లి డీజిల్‌ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని