logo

ఎనిమిది నెలల తర్వాత మృతదేహం లభ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారి ఇచ్చి భర్తను హతమార్చిన సంఘటన గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

Published : 31 Mar 2023 04:39 IST

వైజాగ్‌కాలనీ సమీపంలో కృష్ణా వెనుక జలాలలో లభ్యమైన రాగ్య మృతదేహం

నేరేడుగొమ్ము(చందంపేట), న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారి ఇచ్చి భర్తను హతమార్చిన సంఘటన గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన ధనావత్‌ రాగ్య(30)కు పెద్దవూర మండలం ఊరబావికి చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వగ్రామంలో ఉపాధిలేక హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో రాగ్య భార్య, తన అక్క భర్త అయిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన సపావట్‌ లక్‌పతికి దగ్గరైంది. తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో రాగ్యను హతమార్చాలని నిర్ణయించుకొని నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన ముగ్గురు వ్యక్తులతో రూ.20 లక్షలకు సుపారి కుదుర్చుకుంది. పథకం ప్రకారం.. గత ఏడాది ఆగస్టు 19న రాగ్యను మచ్చిక చేసుకున్న సుపారి సభ్యులు హైదరాబాద్‌ నగర శివారుకు తీసుకువెళ్లి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయాడు. అక్కడి నుంచి నేరేడుగొమ్ము మండలం వైజాగ్‌కాలనీ సమీపంలోని కృష్ణా వెనుకజలాల్లో చేపలు పట్టే వలలో చుట్టి దానికి ఒకరాయిని కట్టి పడవలో కొద్ది దూరం తీసుకువెళ్లి పడవేశారని విచారణలో నిందితులు అంగీకరించినట్లు రాయదుర్గం ఎస్సై సతీష్‌ అప్పట్లో తెలిపారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో ఎనిమిదినెలల తర్వాత ధనావత్‌ రాగ్యనాయక్‌ అవశేషాలు గురువారం వైజాగ్‌కాలనీ సమీపంలోని కృష్ణా వెనుకజలాల్లో లభ్యమయ్యాయి. అక్కడి జాలరులు  నేరేడుగొమ్ము ఎస్సై రాజుకు సమాచారం అందించారు. సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వలలో చుట్టి ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని