logo

ట్రిపుల్‌ ఆర్‌ బాధితుల ఆందోళన ఉద్ధృతం

రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ.. బాధిత రైతులు చేపట్టిన దీక్షల రెండో రోజు మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Published : 31 May 2023 05:06 IST

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించిన ట్రిపుల్‌ ఆర్‌ బాధితులు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ.. బాధిత రైతులు చేపట్టిన దీక్షల రెండో రోజు మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుర ఛైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు మంగళవారం ఎమ్మెల్యేను దీక్షలకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎమ్మెల్యే రాలేదు.ఇదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డితో ఉన్న ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్తుండగా.. పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఆగ్రహించిన బాధితులు గేటు వద్ద గడ్డి దగ్ధం చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మరో గేటు నుంచి వెళ్తుండగా రైతులు వెళ్లి మంత్రి కాన్వాయిని అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అడ్డు తొలగక పోవడంతో డీసీపీ రాజేశ్‌ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు రైతులను చెదర కొట్టారు. అక్కడే ఉన్న భాజపా సీనియర్‌ నాయకుడు గూడూరు నారాయణరెడ్డితో సహ బాధితులు తమ గోడును వినాలని కారును ఆపే ప్రయత్నం చేశారు. అడ్డు తొలగక పోవడంతో బాధితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గూడూరు నారాయణరెడ్డి, బాధిత సంఘం నాయకులు తంగళ్లపల్లి రవికుమార్‌, పల్లెర్ల యాదగిరి, పాండు, మల్లేశ్‌, చందర్‌, నీరజ్‌కుమార్‌, బోగయ్య, నరేందర్‌తో పాటు సుమారు 150 మంది బాధితులను అరెస్ట్‌ చేసి తుర్కపల్లి, భువనగిరి టౌన్‌, రూరల్‌, బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా బాధితులు యాదగిరి, రవికుమార్‌ మాట్లాడారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను అక్రమంగా అరెస్ట్‌ చేయడం సమంజసం కాదన్నారు. మహిళలను సైతం కనికరం లేకుండా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని