logo

సీసం గోళీలు.. ఏడురాళ్ల ఆటలు

వేసవి సెలవులొస్తే వీధుల్లో ఎక్కడ చూసినా మేమే కనిపించేవాళ్లం. స్నేహితులతో కలిసి సీసం గోళీలు, బంతులతో ఏడురాళ్ల ఆటలు ఆడేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు బంధువుల పిల్లలతో కలిసి కొండలు ఎక్కి సరదాగా గడిపేవాళ్లం

Published : 31 May 2023 05:06 IST

బండారు రాజశేఖర్‌, డీఎస్పీ, ఏపీ సీఐడీ

న్యూస్‌టుడే, మఠంపల్లి

వేసవి సెలవుల్లో..

వేసవి సెలవులొస్తే వీధుల్లో ఎక్కడ చూసినా మేమే కనిపించేవాళ్లం. స్నేహితులతో కలిసి సీసం గోళీలు, బంతులతో ఏడురాళ్ల ఆటలు ఆడేవాళ్లం. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు బంధువుల పిల్లలతో కలిసి కొండలు ఎక్కి సరదాగా గడిపేవాళ్లం. అడవుల్లో తిరుగుతూ అక్కడ దొరికే రకరకాల పండ్లను తినేవాళ్లం. మా కుటుంబం మఠంపల్లిలో స్థిరపడటం వల్ల ఇక్కడి వీవీ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకున్నాను. వార్షిక పరీక్షలు రాశాక ఆడుకునేందుకు స్వేచ్ఛ లభించేది. అప్పటి మిత్రులతో ఎన్నెస్పీ ఖాళీ ప్రదేశంలో, మా పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం, సాయంత్రం బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, మధ్యాహ్నం స్నేహితుల ఇళ్లల్లో చెస్‌ ఆడేవాళ్లం. అమ్మతో అమ్మమ్మ వాళ్ల ఊరు ఏపీలోని కారంపూడి వెళ్లి బంధువుల పిల్లలతో పరుగు పందేలు, సైకిల్‌ పోటీల్లో పాల్గొనేవాడిని. అథ్లెటిక్స్‌తో పాటు క్రీడల్లో ఎప్పుడూ ముందుండేవాడిని. ఈ పోటీతత్వమే చదువుల్లో, ఉద్యోగ సాధనలో లక్ష్యం దిశగా నన్ను నడిపించింది. వేసవి సెలవులను ఇష్టమైన విధంగా ఉపయోగించుకొనేలా మా పిల్లలను ప్రోత్సహించేవాడిని. సెలవులు మానసిక వికాసానికి దోహదపడితే, స్నేహితులు సమాజాన్ని మనకు పరిచయం చేస్తారు.


వాహనం ఢీకొని నవవరుని దుర్మరణం

కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: అతనికి పెళ్లయి 20 రోజులే అయింది.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.. సెలవు కావడంతో తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు.. ఇంటి వద్ద భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది.. మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరే సమయంలో.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మండలకేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనయ్య కుమారుడు వెంకటేష్‌(28) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించికొని తన ద్విచక్రవాహనంపై పెండ్లిపాకలకు వస్తుండగా.. స్థానిక హైదరాబాద్‌ రోడ్డులో గల పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో వెంకటేష్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన ఓ యువతితో ఇటీవలే వివాహమైంది. నవవరుడు మృతి చెందడంతో ఇరుకుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతుని తండ్రి శ్రీనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


ఆటో బోల్తా.. యువకుడి మృతి

పెన్‌పహాడ్‌: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన పెన్‌పహాడ్‌ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సింగారెడ్డిపాలెం ఆవాసం జానారెడ్డినగర్‌లో తుల్జాభవాని పండగ సందర్భంగా యాటపోతులు తెచ్చేందుకు ఆంగోతు అజయ్‌, భూక్యా గోపాల్‌, భూక్యా చాంప్లా, భూక్యా వరుణ్‌, ధారావత్‌ హుస్సేన్‌ ఆటోలో గూడెపుకుంట తండాకు వెళుతున్నారు. పెన్‌పహాడ్‌ శివారులోకి రాగానే డ్రైవర్‌ అతివేగంగా నడపడంతో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆంగోతు అజయ్‌ (18), భూక్యా వరుణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆంగోతు అజయ్‌ మృతిచెందారు. సంప్రదాయ పండగను సంతోషంగా జరుపుకోవాల్సిన సమయంలో తమ కుమారుడు రోడ్డు ప్రమాదం బలి తీసుకుందని అజయ్‌ తల్లిదండ్రులు నాగు, నాగమ్మ గుండెలవిసేలా విలపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు అజయ్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం, తమ్ముడు విజయ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కూలీ పనులు చేసుకొని తమ కుమారులను చదివించుకుంటున్నారు. యువకుడి మృతితో జానారెడ్డినగర్‌లో తుల్జాభవాని పండగ రోజున విషాదఛాయలు అలుముకున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని