logo

కల్యాణం.. కమనీయం

దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం కల్యాణ మహోత్సవం కనుల పండువగా కొనసాగింది.

Updated : 31 May 2023 05:28 IST

అమ్మవారికి తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

అమ్మవారి తలంబ్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే

కనగల్‌, న్యూస్‌టుడే: దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం కల్యాణ మహోత్సవం కనుల పండువగా కొనసాగింది. ఎల్లమ్మ, జమదగ్ని మహర్షి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి కల్యాణ మండపం వరకు కోలాటం, భజనలు, డప్పుచప్పుల నడుమ పల్లకిల్లో ఊరేగిస్తూ తీసుకవచ్చారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు రాధాకృష్ణా శర్మ, డేరం భాస్కర శర్మ, నాగోజు మల్లాచారి, చిలకమర్రి శ్రవణకుమారాచార్యులు కల్యాణాన్ని నిర్వహించారు. అమ్మవారికి తలంబ్రాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమర్పించారు. వర్షం కారణంగా కల్యాణాన్ని ఆలయం వెనక భాగంలో రేకుల షెడ్డులో నిర్వహించారు. స్థలం సరిపోకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి, ఆర్‌కేఎస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పిల్లి రామరాజు యాదవ్‌ కల్యాణ మహోత్సవానికి హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో జల్లేపల్లి జయరామయ్య, సర్పంచులు అలుగుబెల్లి పూలమ్మ, చనగోని అంజమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు నకరికంటి శైలజ, మాజీ ఛైౖర్మన్లు కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి నల్లబోతు యాదగిరి, పల్లెబోయిన కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

బలప్రదర్శనకు వేదికగా: దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కల్యాణ మహోత్సవం అధికారపార్టీ నాయకుల బలప్రదర్శనకు వేదికగా మారింది. పొటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు తన అనుచరగణంతో గుత్తా అమిత్‌ రెడ్డి కల్యాణానికి హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు వెంటరాగా అమ్మవారి తలంబ్రాలతో కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆర్‌కేఎస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పిల్లి రామరాజు యాదవ్‌ తన అనుచరులతో వెంటరాగా బాణాసంచా కాల్చుతూ నినాదాలతో కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. ఆయన్ను ఆహ్వానించక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలా అమ్మవారి కల్యాణం అధికార పార్టీ నాయకులు బలప్రదర్శనకు వేదికగా మారింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని