logo

అక్కాచెల్లెళ్లు..సంకల్పంలో విరిసిన మల్లెలు

ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రి మృతి చెందగా.. కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లి కూడా ఇటీవల మృతి చెందింది

Published : 31 May 2023 05:19 IST

పాలెం గ్రామంలో కావేరి, చింటు ఉంటున్న పూరిల్లు

గుర్రంపోడు, హాలియా, న్యూస్‌టుడే: ఊహ తెలియని వయసులోనే కన్నతండ్రి మృతి చెందగా.. కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న తల్లి కూడా ఇటీవల మృతి చెందింది. తల్లడిల్లిన ఆ పసి హృదయాలు మొక్కవోని గుండె ధైర్యంతో భవిష్యత్తు కోసం చదువుకుంటూ ముందుకు సాగుతున్నారు. తమకు దాతృత్వం కలిగిన వారు అందించే అరకొర సాయంతోనే చదువుకుని ఉన్నత స్థానంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. ఒకరికొకరు తోడుగా ఆ ఇద్దరు అక్కా చెల్ల్లెళ్లు సెలవు దినాలలో కూలి పనులు చేసుకుంటూ, మిగతా రోజుల్లో పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్న తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. అనుముల మండలం పాలెం గ్రామానికి చెందిన మంగమ్మకు గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి కలకొండ నాగయ్యతో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగయ్య లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి కావేరికి నాలుగేళ్లు, చిన్నమ్మాయి చింటు ఏడాది వయస్సుండగా నాగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. బతుకుదెరువు కోసం ఇద్దరు పసి పిల్లలతో తల్లిగారింటికి వచ్చిన మంగమ్మ పరిస్థితి గమనించిన పాలెం గ్రామస్థులు ప్రభుత్వ భూమిలో తాత్కాలిక నివాసం పూరి గుడిసె వేసుకోవడానికి సహకరించారు. కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడ పిల్లలు కావేరి, చింటులను చదివించింది. తొమ్మిది నెలల క్రితం మంగమ్మ అనారోగ్యంతో మృతి చెందటంతో ఆ ఇద్దరు పసిపిల్లలు అనాథలయ్యారు.. గంపెడు దుఃఖాన్ని దిగమింగి తల్లి కట్టిన పూరి గుడిసెలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కావేరి హాలియాలో ఒకేషనల్‌ ఇంటర్‌, చింటు చింతగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేశారు. పగటి వేళలో తమ ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో అమ్మమ్మ వద్ద తలదాచుకుంటున్నారు. వన్‌ ఛాలెంజ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, పటాన్‌ చెరువు సీఐ వేణుగోపాల్‌రెడ్డి వారి పరిస్థితి తెలుసుకుని ఈ నెల 26న ఈ చిన్నారుల ఉన్నత చదువుల కోసం రూ.50 వేలు డీడీ రూపంలో ఆర్థిక సహకారం అందించారు. బాగా చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలన్న ఆ చిన్నారుల ఆకాంక్ష నేటి విద్యార్థులకు, యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని