logo

ఆ అధికారి రూటే.. సపరేటు..!

రాజధానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా సాగుభూములను వెంచర్లుగా మారుస్తున్నారు.

Published : 01 Jun 2023 03:11 IST

డబ్బులిస్తే ఎవరి పేరుతోనైనా పాసు పుస్తకాలు
ఈనాడు, నల్గొండ

రాజధానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతుల్లేకుండా విచ్చలవిడిగా సాగుభూములను వెంచర్లుగా మారుస్తున్నారు. వీటికి సదరు అధికారి మద్దతుగా ఉండటంతో స్థిరాస్తి వ్యాపారులు ఆడింది ఆటగా సాగుతోంది.ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారని మండల ధరణి ఆపరేటర్‌ను, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే రెండు, మూడు రోజుల్లోనే సదరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను తిరిగి అదే ప్రాంతానికి బదిలీ చేయాలని ఓ నేత ఒత్తిడి చేయగా.. జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని తెలిసింది. ఇక్కడ జరిగే అక్రమాలకు నియోజకవర్గ ప్రజాప్రతినిధి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఈ కారణాలతోనే సదరు అధికారిని ఇక్కడి నుంచి బదిలీ చేయడానికి ఉన్నతాధికారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇవిగో దృష్టాంతాలు..

* ఓ మాజీ ఎమ్మెల్యేకు మండల కేంద్రం సమీపంలో సుమారు 30 ఎకరాల వరకు భూమి ఉంది. దీనిని కొంత కాలం క్రితం హైదరాబాద్‌కు చెందిన వారికి విక్రయించారు. ఈ స్థలంలో వారు వెంచర్‌ నిర్మాణం చేపట్టారు. గ్రామ కార్యదర్శిని వెంచర్‌ నిర్మాణ అనుమతుల గురించి అడగ్గా.. తమను సంప్రదించలేదని సదరు అధికారి వెల్లడించడం గమనార్హం. ఇలా ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ల నిర్మాణం సాగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వెంచర్‌ నిర్మాణం చేపడుతున్న స్థలంలో చెక్‌డ్యాంలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ భూమిలోనే చెక్‌డ్యాంలను సర్కారు నిర్మించిందనే వాదనలుండగా..అధికారులు, స్థల యజమానులు మాత్రం ప్రైవేటుగా తామే చెక్‌డ్యాం నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడిస్తుండటం గమనార్హం.

* మండలంలోని ఓ మహిళా రైతు 1.07 ఎకరాలను కొనుగోలు చేసి మ్యుటేషన్‌ చేయించుకోగా.. ఆన్‌లైన్‌లోనూ నమోదైంది. అయితే ఈ భూమి పక్కనే ఉన్న బడా బాబుల ఒత్తిడితో సదరు మహిళా రైతుకు డిజిటల్‌ సంతకం చేయలేదు. రెండున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో సదరు రైతు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఈ పరిణామంపై సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటీవలే డిజిటల్‌ సంతకం చేశారు.

* ఇదే మండలంలోని ఓ గ్రామంలో 14.10 ఎకరాల భూమిని నాలా భూమిగా మార్చారు. ప్లాట్లు చేసి అమ్ముడుపోకపోవడంతో దీనిని తిరిగి వ్యవసాయ భూమిగా మార్చేందుకు సదరు స్థిరాస్తి వ్యాపారులు నిర్ణయించగా..అధికారి ఈ 14.10 ఎకరాలకు పాసుపుస్తకాలను మంజూరు చేసినట్లు తెలిసింది.

నల్గొండ జిల్లాలో.. మారుమూల ప్రాంతంగా పేరొందిన నియోజకవర్గంలోని మండలమది. రాజధానికి దగ్గరగా ఉండటం, హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రహదారిపై మండల కేంద్రం ఉండటంతో అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడిదే అక్కడి అధికారికి వరమైంది. ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రతి పనికి ధర నిర్ణయించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే భూమి లేని వారి పేరిట అయినా పాసుపుస్తకాలు వస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ భూములు హాంఫట్‌..!

మండలంలోని ప్రభుత్వ భూములను ఇక్కడి ప్రజాప్రతినిధి అధికారి సాయంతో చెరబట్టినట్లు తెలిసింది. సుమారు 32 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను సదరు ప్రజాప్రతినిధి బినామీలు, స్థానికంగా ఉండే మరో ప్రజాప్రతినిధి పేర్లతో నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రభుత్వ భూముల విలువ రూ.కోట్లలోనే ఉంటుందని సంబంధిత వర్గాలు ‘ఈనాడు’కు వెల్లడించాయి. మండలంలో ఎక్కడ ప్రభుత్వ, అసైన్డ్‌ భూములున్నాయో సదరు అధికారి ప్రజాప్రతినిధికి చెప్పడం, బినామీ పేర్లతో సదరు నేత దక్కించుకోవడం గత మూడు నాలుగేళ్లుగా నడుస్తోంది. మూడు, నాలుగు నెలల కింద ఇదే మండలంలోని విలువైన ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం నియోజకవర్గ నేత కుటుంబానికి చెందిన బినామీ పేర్లతో ధరణిలో నమోదు చేసినట్లు సమాచారం. రూ.కోట్ల విలువైన భూములను తన పరం చేయడంతో సదరు అధికారిని ఎక్కడికి బదిలీ చేయడానికి ఆ నేత ఒప్పుకోవడం లేదని తెలిసింది.

సమగ్ర విచారణ చేసి తప్పుంటే  చర్యలు తీసుకుంటాం

వినయ్‌ కృష్ణారెడ్డి, కలెక్టరు, నల్గొండ

అనుమతులు లేకుండా వేస్తున్న వెంచర్‌లో చెక్‌డ్యాంలు ఉన్నాయనే దానిపై సమగ్ర విచారణ చేస్తాం. ఆ చెక్‌డ్యాంలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయా? ప్రైవేటుగా నిర్మించుకున్నారనే దానిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తాం. ఈ వ్యవహారంలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని