logo

ప్రగతి చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పరిపాలన పట్టణ అభివృద్ధిశాఖ కార్యదర్శి, నోడల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

Published : 01 Jun 2023 03:11 IST

నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తున్న నోడల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి. చిత్రంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌లు, తదితరులు

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పరిపాలన పట్టణ అభివృద్ధిశాఖ కార్యదర్శి, నోడల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావులతో కలిసి అధికారులతో సమీక్షించారు. జూన్‌ 2 నుంచి 22 వరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర, జిల్లా ప్రగతిని చాటేలా ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలు ప్రణాళికబద్ధంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. శాఖల వారీగా చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత ఉండాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత సాధించిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయాలను, ప్రగతిని గతంతో పోల్చుతూ నాడు-నేడు పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులను సన్మానించాలన్నారు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు, సంబంధిత శాఖలు మైక్రో ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూన్‌ 2న జాతీయపతాక ఆవిష్కరణ, అమరుల స్తూపం వద్ద నివాళులు ఉంటాయని చెప్పారు. జిల్లా స్థాయిలో అమరులకు నివాళులు, రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌ సందేశం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు నిర్వహణ ఏర్పాట్లను వివరించారు. అదనపు కలెక్టర్‌ ఖుష్భూగుప్తా, భాస్కర్‌రావు, డీఎఫ్‌వో రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని