logo

మామిడి రైతుకు నష్టాల చేదు

మామిడి రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా కనీసం పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో మామిడి చెట్లను తొలగించాలనే యోచన చేస్తుండటం ఆందోళనకరంగా మారింది.

Published : 01 Jun 2023 03:11 IST

ధర తగ్గడంతో పెట్టుబడులు రాని వైనం
తోటలను నరికివేస్తున్న కర్షకులు
భానుపురి, న్యూస్‌టుడే

పెన్‌పహాడ్‌: లింగాలలో ఓ రైతు నరికివేసిన మామిడి తోట

మామిడి రైతులు ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనివిధంగా కనీసం పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో మామిడి చెట్లను తొలగించాలనే యోచన చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో 10,720 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో కురిసిన అకాల వర్షం.. వడగళ్లు, వీచిన బలమైన గాలులతో 30 శాతానికి పైగా కాయలను నేలరాలడంతో రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 1.05 లక్షల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి ఉంటుంది. ఈ సారి 35 వేల మెట్రిక్‌ టన్నుల కాయలను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. సీజన్‌ ముగియనుండగా మరో మూడు, నాలుగు వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ లెక్కలను చూస్తే కాపు తగ్గినట్లు తెలుస్తోంది.

వెంటాడిన చీడపీడల బెడద

ఈ సారి మామిడిపైనా చీడపీడల బెడత గణనీయంగా పెరిగింది. తేనెమంచు, బూడిద తెగులు, ఇతరత్రా పురుగులు, తెగుళ్లు తీవ్రంగా ఆశించడంతో కాయలపై మంగు మచ్చలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎగుమతి తగ్గిందంటూ దిల్లీ వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ధర అమాంతం తగ్గింది. జిల్లాలో అధికంగా సాగులో ఉన్న బంగినపల్లి రకానికి గతేడాది ఈ సమయానికి క్వింటాకు రూ.3000-4300 ధర ఉండగా ఈసారి రూ.1200-2800 మాత్రమే పలికింది. మంగు మచ్చలున్న కాయలను వేరుచేసి రూ.500-800 ధరకు కొనుగోలు చేస్తున్నారు.

120 ఎకరాల్లో తోటలు మాయం

జిల్లాలో దిగుబడి, ధర గణనీయంగా తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు దిగులు చెందుతున్నారు. మామిడికి వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయనందున ప్రకృతి విపత్తుల నష్టానికి ఆర్థిక ఆసరా దక్కలేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో దాదాపుగా 120 ఎకరాల్లో మామిడి తోటలను నరికివేసి ఇతర పంటల సాగుకు మళ్లుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పెన్‌పహాడ్‌ మండలం లింగాలలో 30, చీదెళ్లలో 10, కోదాడ మండలం గుడిబండలో 30, మునగాలలో 30, నూతనకల్‌ మండలం ఎర్రపహాడ్‌లో 20 ఎకరాల్లో మామిడి తోటలను రైతులు నరికివేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగైదేళ్లలో 70 శాతం వరకు మామిడి తోటలు మాయమయ్యే ప్రమాదముంది.

ప్రతిపాదనలు పంపాం

రామారావు నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి, సూర్యాపేట

జిల్లాలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి రైతులకు పరిహారం అందించే విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రాగానే బాధితులకు పరిహారం అందజేస్తాం. మొదటి విడతలో సుమారు 1,400 ఎకరాల్లో మామిడి తోటలు నష్టపోయాయి.
ఆరుగాలం కష్టపడి సస్యరక్షణ చర్యలు తీసుకున్నా మామిడి తోటలకు కనీసం పెట్టుబడులు రావడం లేదు. మార్కెట్‌లో దళారులు ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు ధర రాక ఈసారి నష్టపోయిన పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన పలువురు రైతులు 40 ఎకరాల్లో మామిడి తోటలను నరికివేశారు. ఇతర పంటలు సాగు చేసినా లాభాలు వచ్చేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని