logo

ఉమ్మడి జిల్లా సమర్పించు దశాబ్దం

2014లో పురుడు పోసుకున్న తెలంగాణ.. బుడిబుడి అడుగులు వేస్తూ.. వడివడిగా పరుగులు తీస్తూ.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని.. పదో ఏట అడుగుపెడుతోంది.. గడిచిన తొమ్మిదేళ్లలో..

Updated : 02 Jun 2023 05:41 IST

2014-2023

ఈనాడు, నల్గొండ : 2014లో పురుడు పోసుకున్న తెలంగాణ.. బుడిబుడి అడుగులు వేస్తూ.. వడివడిగా పరుగులు తీస్తూ.. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని.. పదో ఏట అడుగుపెడుతోంది.. గడిచిన తొమ్మిదేళ్లలో..మడిలో దిగుబడి పెరిగింది.. బడిలో అక్షరం వెలిగింది.. పరి‘శ్రమ’ ఫలించింది.. సం‘క్షేమం’ విరిసింది.. రైతుకు బంధువైంది..  సర్కారు దవాఖాన బాగు పడింది.. మొత్తంగా ప్రజల వద్దకే యంత్రాంగం చేరువైంది.. పాలన సులభమైంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే అత్యంత లబ్ధిపొందిన జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిలిచింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా ఖ్యాతికెక్కగా.. తాజాగా ముగిసిన యాసంగి సీజన్‌లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు సాధించినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.

* రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రాజెక్టులు, చెరువుల ద్వారా 10.5 లక్షల ఎకరాలకు నీళ్లందుతున్నది ఉమ్మడి జిల్లాలోనే కావడం విశేషం. వరి, పత్తి పంటలు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్నది ఇక్కడే.

*  2014 జూన్‌ వానాకాలం సీజన్‌లో.. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా..2022 - 23 ఏడాదిలో తాజాగా ముగిసిన యాసంగి సీజన్‌లో 11.3 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు.

*  2014 - 15 ఏడాదిలో ధాన్యం దిగుబడులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా..2022 - 23 ఏడాదిలో 78 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది.

*  2014 - 15లో ఎడమ కాల్వ కింద 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందగా..తాజాగా ముగిసిన యాసంగిలో వారబOదీ పద్ధతిలో ఎడమ కాల్వ కింద 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఒక్క ఎడమకాల్వ కిందనే 60 వేల ఎకరాల కొత్త ఆయకట్టు పెరగడం విశేషం.

*  2015 - 16 ఏడాదికి గానూ ఎడమ కాల్వ కింద సాగునీటి అవసరాలకు 12 నుంచి 15 టీఎంసీలు వాడగా...అది 2022 - 23 ఏడాదికి వచ్చే సరికి రెండు పంటలకు కలిపి నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 100 టీఎంసీల నీటిని వాడటం విశేషం.

*  మరో ప్రధాన పంట అయిన పత్తి సైతం రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండలోనే ఎక్కువగా సాగవుతోంది. 2014 - 15 సీజన్‌లో 7 లక్షల ఎకరాల వరకు పత్తి సాగవగా...2022 - 23 ఏడాదిలో అది 9 లక్షల ఎకరాలకు పెరిగింది. œతంలో పోలిస్తే దిగుబడులు తగ్గడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజకరంగా లేకపోవడంతో క్రమంగా పత్తి రైతులు వరి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు.

వ్యవసాయంలో అగ్రగామి..


ఆహ్లాదకరం... బుద్ధవనం

ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యాటకంగా ఈ తొమ్మిదేళ్లలో అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందింది. నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతమైన వైజాగ్‌కాలనీ, చందంపేట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు పట్టాలెక్కడం లేదు. మరోవైపు ప్రభుత్వ నిధులతో చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆకట్టుకుంటుంది.


అందుబాటులోకి.. అధునాతన వైద్యం

* తెలంగాణ ఆవిర్భావం అనంతరం నల్గొండ, సూర్యాపేటల్లో వైద్య కళాశాలలు ఏర్పాటవగా..భువనగిరి జిల్లా బీబీనగర్‌లో కేంద్ర తోడ్పాటుతో ఎయిమ్స్‌ మంజూరైంది. దీంతో ఉమ్మడి జిల్లా వైద్యుల కార్ఖానాగా మారనుంది. సూర్యాపేటలో వైద్యకళాశాల నిర్మాణం పూర్తవగా..త్వరలోనే ప్రారంభించనున్నారు. నల్గొండలో పనులు పురోగతిలో ఉండగా..ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణ పనులకు రూ.వేయి కోట్ల నిధులతో ప్రధాని మోదీ ఇటీవలే శంకుస్థాపన చేశారు.

* నాగార్జునసాగర్‌, దేవరకొండ, కోదాడ, భువనగిరి, చౌటుప్పల్‌లో డయాలసిస్‌ కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటికే నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఆలేరు ప్రాంతాల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నాయి.

* యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, నకిరేకల్‌లో వంద పడకల ఆసుపత్రులు మంజూరయ్యాయి. పనులు పురోగతిలో ఉన్నాయి.

* పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ వాటిని పల్లె దవాఖానాలుగా మార్చారు. నల్గొండ జిల్లాలో 138 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయగా, 10 బస్తీ దవాఖానాలను ప్రతిపాదించారు. సూర్యాపేటలో 161, యాదాద్రిలో 8 కేంద్రాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారు.

* నల్గొండ జనరల్‌ ఆసుపత్రిలో గతేడాది టీహబ్‌ను ఏర్పాటు చేయగా... త్వరలోనే సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది.


ఫ్లోరైడ్‌ రక్కసిని తరిమికొట్టేలా..!

నల్గొండ జిల్లాలో ఏళ్లుగా ఫ్లోరైడ్‌ రక్కసితో సతమతమవుతున్న ప్రజలకు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిని చౌటుప్పల్‌లోనే సీఎం కేసీఆర్‌ 2015 జూన్‌ 8లో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. దీని వల్ల నల్గొండ జిల్లాలో చాలా గ్రామాలకు భూగర్భజలాలు కాకుండా కృష్ణా జలాలు అందుతున్నాయి. గత ఆరేళ్లలో నల్గొండ జిల్లాలో ఎక్కడా ఒక్క ఫ్లోరిన్‌ కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం ప్రకటించడం విశేషం.


పరిశ్రమలకు ఆదరువు..

దేశంలోనే తొలిసారిగా రెండు వేల ఎకరాల్లో కాలుష్య రహితంగా (గ్రీన్‌) సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి 2019 నవంబరు 1న పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటి వరకు 60 కంపెనీలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రారంభించగా...మరో నెల రోజుల్లో 100కు పైగా కంపెనీలు ఉత్పత్తులను మొదలుపెట్టాలనే కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మరో 100 కంపెనీల నిర్మాణం వివిధ దశల్లో ఉంది.


గురుకులాలతో దిగ్విజయం..

రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మండలానికి ఒకట్రెండు చొప్పున గురుకులాలను ప్రభుత్వం నెలకొల్పింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 100కి పైగా వివిధ గురుకులాలను స్థాపించగా..పదో తరగతితో పాటూ ఇంటర్మీడియట్‌, కొన్ని చోట్ల డిగ్రీ వరకు అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు దీటుగా గురుకులాల్లో చదివిన ఆణిముత్యాలకు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయి. దీంతో గురుకులాల్లో సీటుకు ప్రస్తుతం డిమాండ్‌ ఏర్పడింది. ఈ తొమ్మిదేళ్లలో విద్యా వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు గురుకులాల స్థాపనేనని విద్యారంగ నిపుణులు వెల్లడిస్తుండటం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని