logo

రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వీహెచ్‌

ట్రిఫుల్‌ ఆర్‌ బాధిత రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

Published : 02 Jun 2023 04:48 IST

సబ్‌జైలు ముందు బైఠాయించిన హనుమంతరావు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: ట్రిఫుల్‌ ఆర్‌ బాధిత రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. భువనగిరి సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ బాధిత రైతులను గురువారం వీహెచ్‌ పరామర్శించారు. ప్రాంతీయ రింగు రోడ్డు అలైన్మెంట్‌ మార్చాలని మంగళవారం కలెక్టరేట్‌ వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నలుగురు రైతులు పల్లెర్ల యాదగిరి, గడ్డమీది మల్లేషం, అవిశెట్టి నిఖిల్‌, మల్లబోయిన బాలులను భువనగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిని ములాఖత్‌ ద్వారా కలిసేందుకు వీహెచ్‌ జైలు అధికారుల అనుమతి కోరారు. అనుమతి రాకపోవడంతో  ఆయన కొద్దిసేపు జైలు ద్వారం ముందు బైఠాయించారు. పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ అక్కడకు చేరుకొని వీహెచ్‌తో మాట్లాడారు. రోడ్డు నిర్మాణం కోసం మొదట్లో ప్రతిపాదించిన అలైన్మెంట్‌ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అనంతరం రైతులతో వీహెచ్‌ మాట్లాడారు. భువనగిరి కేంద్రంగా మరో నయీం తయారయ్యాడని అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. ఈ విషయమై సబ్‌జైలు అధికారి పూర్ణచందర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ జైలు నిబంధనల మేరకు ములాఖత్‌ కలిసే ప్రక్రియలో 15-20 నిమిషాల సమయం పడుతుందని,  ఆ తనిఖీలో భాగంగానే ఆలస్యం జరిగిందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని