logo

నీలగిరి.. అభివృద్ధి సిరి..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు స్వయం పాలన కూడా అదే రోజు ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్‌ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది.

Published : 03 Jun 2023 05:04 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ కలెక్టరేట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, తదితరులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాటు స్వయం పాలన కూడా అదే రోజు ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్‌ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.

బీడు భూములు సస్యశ్యామలం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా, గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకొని ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. నల్గొండ జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు డిండి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు కొనసాగుతున్నాయి. లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేేందుకు రూ.674.67 కోట్లతో ఉదయసముద్రం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ప్రారంభించి ఇప్పటి వరకు రూ.524.92 కోట్లు ఖర్చు చేశాం.  ట్రయల్‌రన్‌ ద్వారా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులో నీళ్లు నింపడం జరిగింది. మిగతా ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి.

రైతుల హృదయాల్లో ఆశాదీపం

ఒకప్పుడు రైతులు రుణాల ఊబిలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేడు కర్షకుల హృదయాల్లో తెలంగాణ ఏర్పాటు ఆశాదీపాలను వెలిగించింది. సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ పథకం కింద జిల్లాలో 2018 వానాకాలం నుంచి 2022 యాసంగి వరకు 4,83,179 మంది రైతులకు రూ.5243.99 కోట్లు అందజేశాం. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. జిల్లాలో 140 వ్యవసాయ క్లస్టర్లకు రైతు వేదికల నిర్మాణం చేశాం.

దళిత జాతి అభ్యుదయం కోసం

అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 517 కుటుంబాలకు రూ.51.70 కోట్లు ఖర్చు చేశాం.

కుల వృత్తులకు చేయూత

హాజరైన జిల్లా అధికారులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

చేపలు దిగుమతి చేసుకునే దశ నుంచి నేడు ఎగమతి చేసే దశకు రాష్ట్రం చేరుకుంది. జిల్లాలో 3,807 చెరువుల్లో 2016 నుంచి ఇప్పటి వరకు వంద శాతం రాయితీతో రూ.29.28 కోట్ల విలువైన 29.92 కోట్ల చేప పిల్లలను, రూ.3.47 కోట్ల విలువైన 1.51 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో వదిలాం. నేతన్నకు చేయూత పథకం కింద జిల్లాలో 711 మంది చేనేత కార్మికులకు రూ.1.30 కోట్లు, 2,922 మంది మరమగ్గ కార్మికులకు రూ.2.41 కోట్లు అందించాం. గీత కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వ భూముల్లో 27.67 లక్షల ఖర్జూర, ఈత చెట్లు నాటాం.  ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలకు రూ.3.61 కోట్లు అందజేశాం.

* దేశంలో కెల్లా తెలంగాణలో అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్నాం. నల్గొండలోని ఎస్‌ఎల్‌బీసీ నందు 42 ఎకరాల్లో రూ.275 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో 195 ఉప ఆరోగ్య కేంద్రాలను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేస్తున్నారు.  

* ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంలో భాగంగా మొదటి విడతగా జిల్లాలో 517 పాఠశాలలను ఎంపిక చేసి రూ.175.37 కోట్లు మంజూరు చేశాం.  జిల్లాలో 15 గురుకులాలను ఏర్పాటు చేయడంతో 8,463 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

* తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్‌ ద్వారా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగాం. ఈ పాలసీ ద్వారా ఎంతో మంది యువకులు నూతన పారిశ్రమికవేత్తలుగా ఎదిగారు. జిల్లాలో దీని కింద 720 యూనిట్లు భౌతికంగా మంజూరు చేసి మొత్తం రూ.30,160 కోట్ల పెట్టుబడిని పొంది 55 పరిశ్రమలు అన్ని అనుమతులు పొంది ఉత్పత్తిని ప్రారంభించాయి.

నల్గొండ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఎగురవేసి వందనం చేస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్మన్‌, తదితరులు
 

ఇంటింటికి తాగునీరు

మిషన్‌భగీరథ పథకంతో మారుమూల ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నాం. జిల్లాలో 1,763 ఆవాసాలు, ఏడు పురపాలికల్లో 4,18,738 నల్లా కనెక్షన్లు ఇచ్చాం. దీనికి రూ.2,942 కోట్లు ఖర్చు చేశాం. ఆసరా పింఛన్ల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 2,12,663 మంది లబ్ధిదారులకు రూ.2809 కోట్లను పంపిణీ చేశాం. రెండు పడుకగదుల ఇళ్ల నిర్మాణ పథకంలో ఇప్పటి వరకు జిల్లాలో 2,867 ఇళ్లు పూర్తి చేసి 274 మంది లబ్ధిదారులకు అందచేశాం. త్వరలో మిగతా ఇళ్లు పంపిణీ చేస్తాం. హరితహారంలో భాగంగా 8 విడతలుగా జిల్లాలో 2.05 కోట్ల మొక్కలు నాటాం.

* జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్‌, భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, ఖుష్భూగుప్తా, పుర ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, గ్రంధాయ సంస్థ ఛైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

* తొలుత గడియారం సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు.

నాగార్జునసాగర్‌: సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న జానారెడ్డి

నల్గొండ: భాజపా కార్యాలయంపైన జాతీయ జెండా ఎగురవేస్తున్న జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి

సాగర్‌: బుద్ధవనంలో జెండాను ఎగురవేస్తున్న ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య

నీలగిరి:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం వివిధ పార్టీ, ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు. భాజపా జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి సోనియా చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బుద్ధవనంలో ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య  జాతీయ జెండా ఆవిష్కరించి గీతాలాపన చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని