logo

దశాబ్ది ఉత్సవం.. విద్యార్థులకు పాఠ్యపుస్తకం

విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల రాక...పోకలు సాగుతున్నాయి. 2023-24లో విద్యాసంవత్సరంలో ప్రభుత్వ రంగంలో చదివే అన్ని పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

Updated : 03 Jun 2023 05:56 IST

జిల్లాకు రాక.. మండల కేంద్రాలకు చేరవేత

నల్గొండలో ఆర్టీసీ కార్గో వాహనం నుంచి పాఠ్యపుస్తకాలను దిగుమతి చేస్తున్న దృశ్యం

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల రాక...పోకలు సాగుతున్నాయి. 2023-24లో విద్యాసంవత్సరంలో ప్రభుత్వ రంగంలో చదివే అన్ని పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ సారి రెండు విడతలుగా పాఠ్యపుస్తకాలు పంపిణీ జరగనుంది. జూన్‌లో పార్టు-1, సెప్టెంబర్‌లో పార్టు-2 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. పార్టు-1 పుస్తకాలు మే చివరి నాటికి 77 శాతం వచ్చి చేరాయి. మిగిలినవి కూడా మొదటి వారంలోగా వస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చిన వాటిలో 63 శాతం వరకు మండల కేంద్రాలకు చేరవేశారు. పాఠశాలలు ప్రారంభం నాటికి జిల్లాలో వంద శాతం పాఠ్య పుస్తకాలు మండలాలకు పంపించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేకంగా నిర్వహించనున్న విద్యా దినోత్సవంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ కార్యాచరణ రూపొందించుకుంటోంది. జిల్లాలోని ప్రభుత్వ విద్యారంగంలో చదివే విద్యార్థులకు దాదాపు 9.53 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని అంచనా వేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అందించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈనెల 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండటంతో పాఠశాలలు ప్రారంభమైన వారం విద్యాదినోత్సవం నాడు విద్యార్థులకు పుస్తకాలు అందించనున్నారు.  

రెండు విడతల్లో..

పార్టు-1 పుస్తకాలు జిల్లాకు 7,51,807 అవసరం అని అంచనా. ఇందులో గతంలో ఇక్కడి గోదాములో 31,937 పుస్తకాలు మిగిలి ఉండగా, కొత్తగా 7,19,870 అవసరమని గుర్తించారు. జిల్లా కేంద్రంలోని గోదాముకు ఈనెల 31 నాటికి 5,51,130 పుస్తకాలు వచ్చాయి. వాటిని ఈ నెల 15 నుంచి మండల కేంద్రాలకు పంపిణీ ప్రారంభించారు. ఈనెల 25 నాటికి మండల కేంద్రాలకు, గురుకుల పాఠశాలలకు మొత్తం 4,70,400 ఉచిత పాఠ్యపుస్తకాలు సరఫరా చేశారు. ఈ నెల 25 తరువాత నుంచి 99,470 పుస్తకాలు జిల్లా గోదాముకు కొత్తగా వచ్చాయి. మిగిలినవి వారం రోజుల్లో వస్తాయని అంచనా వేస్తున్నారు. గత విద్యా సంవత్సరం జిల్లాలో 2.27 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇటీవల 13 వేల మంది పదోతరగతి పూర్తి చేశారు. కొత్తగా వచ్చే విద్యార్థులకు, 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు కొత్తగా పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చిన పుస్తకాలు మండల కేంద్రాలకు పంపించి విద్యార్థులకు అందించనున్నారు.  

2.27 లక్షల మంది విద్యార్థులు

నల్గొండ జిల్లాలో 2022-23 విద్యాసంవత్సరంలో 2,27,785 మంది విద్యార్థులు విద్య అభ్యసించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 93,541 మంది, గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో 31,565 మంది ఉన్నారు. మిగిలిన వారు ప్రైవేట్‌ విద్యార్థులు. ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్త్తోంది. ఇటీవల పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ యాజమాన్యం నుంచి 13 వేల పైచిలుకు మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆయా విద్యార్థులు పోగా మిగిలిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందనున్నాయి. దీంతో పాటు కొత్తగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చేరే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేలా అంచనాలు రూపొందించి ఆ లెక్కల ప్రకారం పుస్తకాలను తెప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని