logo

పెరుగుతున్న కృత్రిమ గర్భధారణ

ఉమ్మడి జిల్లాలో కృత్రిమ గర్భధారణ ద్వారా చూడీ విధానం పెరుగుతోంది. గతంలో వేలల్లో ఉండే ఈ సంఖ్య ప్రస్తుతం లక్షలకు చేరింది. ఇందులో గోపాలమిత్రలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Published : 03 Jun 2023 05:04 IST

నాణ్యమైన పాడి పశువుల సంఖ్య వృద్ధికి కృషి

ఎల్‌ఎన్‌టు కంటైనర్‌తో వెళ్తున్న గోపాలమిత్ర

గరిడేపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో కృత్రిమ గర్భధారణ ద్వారా చూడీ విధానం పెరుగుతోంది. గతంలో వేలల్లో ఉండే ఈ సంఖ్య ప్రస్తుతం లక్షలకు చేరింది. ఇందులో గోపాలమిత్రలు కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషకులకు సేవలందించేందుకు నియమితులైన వీరు పల్లె ముంగిట తమ సేవలను విస్తరిస్తున్నారు. ప్రధానంగా పశువుల్లో కృత్రిమ గర్భధారణకు వీర్యం (సెమన్‌) అందించడంలో వీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాడి పరిశ్రమతో పాటు గొర్రెలు, మేకల సంపద పెరగడంతో వారి సేవలు అత్యవసరంగా మారాయి. రెండు దశాబ్దాల కిందట వైద్యుల నియామకాలు తక్కువ ఉన్న సమయంలో పశువులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు, వీర్యం వేయడానికి వైద్యులకు సహాయకులుగా గోపాలమిత్రలను నియమించారు. అప్పుడే దున్నపోతులు సంఖ్య తగ్గుతుండటంతో నాణ్యమైన పశుసంపద పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎదకు వచ్చిన పశువుల్లో కృత్రిమ గర్భధారణ నిమిత్తం వీర్యం అందించాలని నిర్ణయించింది. ఒక సెమన్‌ వేసినందుకు రైతులు రూ.130 వరకు ఇస్తుంటారు. గేదె, ఆవు ఎదకు వచ్చిన పశువులలో లక్షణాలు కన్పించగానే సంబంధిత రైతు గోపాలమిత్రకు ఫోన్‌ చేస్తారు. వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఎదకు వచ్చిన పశువుకు ఇంజక్షన్‌ ద్వారా వీర్యం ఎక్కిస్తారు. వీరితో పాటు మైత్రి, పశుమిత్ర, జీవమిత్ర వంటి వారిని పశువైద్యులకు సహాయకులుగా నియమించారు. వారు కూడా సేవలు అందిస్తున్నారు.

తగ్గిన దున్నపోతుల సంఖ్య

పల్లెల్లో దున్నపోతుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1999-2000 నుంచి వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వం అధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల సంఖ్య పెంచడానికి సెమన్‌ పద్ధతిని తీసుకువచ్చింది. కరీంనగర్‌లోని ఎఫ్‌ఎస్‌బీఎస్‌ (ఫ్రోజోన్‌ సెమన్‌ బుల్‌ స్టేషన్‌)లో బ్రీడర్‌ దున్నపోతుల నుంచి వీర్యం సేకరించి భద్రపరుస్తారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని వైద్యశాలలకు పంపిస్తారు. మైనస్‌ డిగ్రీల చల్లదనంలో భద్రపరిచి గోపాలమిత్రలకు అందిస్తారు. వారు సెమన్‌ భద్రపరిచే ఎల్‌ఎన్‌టు కంటైనర్‌లో వాటిని తీసుకెళ్తారు. గతంలో పశువులు ఎదకు రాగానే వాటిని పశువైద్యశాలకు తోలుకురావాల్సి వచ్చేది. ఆలస్యమైతే పశువు ఎద చల్లారిపోయేది. అందుకే ఇంటి వద్దనే సెమన్‌ ఇచ్చేలా ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. మండలంలో ముగ్గురు, నలుగురు గోపాలమిత్రలు ఉండటంతో అరగంటలోపు రైతు ఇంటికి వెళ్లగలుగుతున్నారు. వెంటనే సెమన్‌ వేయడంతో ఎదకు వచ్చిన పశువుకు చూడీ నిలుస్తోంది. సులువైన పద్ధతి కావడంతో రైతులు ఎక్కువగా ఈ వైపు మొగ్గుచూపుతున్నారు. నాణ్యమైన పశువులు జన్మిస్తుండటంతో రైతులు ఆసక్తి పెంచుకున్నారు. అందుకే ఇప్పుడు 15 శాతం దున్నపోతులను నేరుగా కలిపి గర్భధారణ చేయిస్తుండగా, 85 శాతం కృత్రిమ గర్భధారణ ద్వారా చూడీ కట్టిస్తున్నారు.


ఆదరణ పెరిగింది: పాశం శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి, డీఎల్‌డీఏ, నల్గొండ

పాడి ఆవులు, గేదెల్లో కృత్రిమ గర్భధారణకు పోషకులు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం గోపాలమిత్రల ద్వారా నేరుగా పశుపోషకుడి ఇంటికి సెమన్‌ తీసుకెళ్తుంటారు. వారి సేవలు అందుబాటులో ఉండటంతో రైతులు 80 శాతం మంది కృత్రిమ గర్భధారణకు ప్రాధాన్యమిస్తున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని