logo

సూర్య@46

ఉదయం 7 గంటలకే వేడిగాలులు, పది గంటలు దాటితే బయటకు వెళ్లలేని స్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితి.

Updated : 03 Jun 2023 05:56 IST

ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

ఈనాడు, నల్గొండ, సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: ఉదయం 7 గంటలకే వేడిగాలులు, పది గంటలు దాటితే బయటకు వెళ్లలేని స్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం దామరచర్లలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 18 ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదుకాగా.. అందులో ఏడు ప్రాంతాలు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందినవే ఉన్నాయి. గత నెల 28న నల్గొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..తాజాగా శుక్రవారం 46.8 డిగ్రీలు నమోదై రికార్డు సృష్టించింది. ఈ ఏడాది రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఉదయం 7 గంటలకే మొదలవుతున్న వడగాలులు రాత్రి 10 గంటలకైనా తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, వడగాలుల వల్ల అనధికారికంగా 12 మంది మృతిచెందినట్లు సమాచారం.

నీటి కోసం కాకి ఆరాటం

ఇక్కడే ఎక్కువ ఎందుకంటే ?

రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉండటం, దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో ఉండటంతో అక్కడి నుంచి వచ్చే వేడి వల్ల నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ డైరెక్టర్‌ కె.నాగరత్న ‘ఈనాడు’కు వెల్లడించారు. ఏటా ఏపీలోని విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ ప్రభావం తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలపై ఉంటుందన్నారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే నల్గొండ, సూర్యాపేటల్లో ఈ ఏడాది 45 డిగ్రీలు నమోదయిన ప్రాంతాలు సుమారు 40 శాతం మేర పెరిగినట్లు తెలిసింది. కృష్ణా పరివాహక ప్రాంతాలైన దామరచర్ల, పాలకవీడు, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు ప్రాంతాలు పూర్తిగా లైమ్‌స్టోన్‌, సున్నపురాయి నిక్షేపాలు గణనీయంగా ఉండటంతో ఇక్కడ సహజంగానే వేడి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇది మరింతగా ఉండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం వెలువరించిన అట్లాస్‌ (తెలంగాణ సమగ్ర సమాచారం)లోనూ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కృష్ణా పరివాహక ప్రాంతాలైన నల్గొండ, సూర్యాపేటల్లోనే నమోదవుతాయని వెల్లడించడం విశేషం. తరచుగా  45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్న ప్రాంతాల్లో మునగాల, దామరచర్ల, మఠంపల్లి, చివ్వెంల, కేతేపల్లి, హుజూర్‌నగర్‌, నిడమనూరు, మోతే ఉంటున్నాయి. ఇవన్నీ కృష్ణా పరివాహక ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని