logo

రాచకొండకు పూర్వ వైభవం వచ్చేనా?

హైదరాబాద్‌కు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాచకొండ.. 14వ శతాబ్దంలో 115 ఏళ్లపాటు రాజధానిగా కొనసాగినందున ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా మారే  బదులు ‘అనాథ’లా మారింది.

Published : 03 Jun 2023 05:04 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించి ఎనిమిదేళ్లయినా కలగని మోక్షం

రాచకొండ ముఖద్వారం

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న రాచకొండ.. 14వ శతాబ్దంలో 115 ఏళ్లపాటు రాజధానిగా కొనసాగినందున ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా మారే  బదులు ‘అనాథ’లా మారింది. ఎందరో వీరులకు, కవులు, కళాకారులకు నిలయమై జనరంజకంగా పాలన సాగిన రేచర్ల ‘పద్మనాయక పాలన బహుమనీ సుల్తానుల దండయాత్రతో 1475లో అంతమైందని, బహుమనీల గవర్నర్‌గా నియమితుడైన శితాబ్‌ఖాన్‌ సైతం రాచకొండను కేంద్రంగా చేసుకుని పాలించాడని చరిత్రకారుల మాట. ఇంతగొప్ప రాచరిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వమున్న రాచకొండను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి సంవత్సరంలోనే 2014 డిసెంబరులో సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ఆనాటి చారిత్రక కట్టడాలను హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేలో ఆయన వీక్షించారు. సుమారు పది వేల ఎకరాల్లో విస్తరించిన ఒకనాటి తెలుగు రాజులు పాలించిన రాచకొండకు కేసీఆర్‌ పూర్వ వైభవం తెస్తారని ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు.

శత్రు దుర్భేద్యంగా నిర్మించిన రాచకొండ కోట చుట్టూ చైనా గోడను తలపించే విధంగా గుట్టలను కలుపుతూ భారీ రాళ్లతో నిర్మించిన ప్రాకారాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆరొందల అడుగుల ఎత్తయిన కచేరీ కొండపై నిర్మించిన రాజస్థానాన్ని చేరాలంటే ఏడు ద్వారాలను, వాటికి పహారా ఉండే సైనికులను దాటుకుని వెళ్లేలా నిర్మించిన రక్షణ వ్యవస్థ అబ్బుర పరుస్తుంది. కొండపైకి వెళ్లేందుకు రాతితోనే నిర్మించిన మెట్లు ఇప్పటికీ ఆనవాళ్లుగా మిగిలాయి. పద్మనాయకులు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారని, పంటలకు నీటి వనరుల కోసం ఆనాడు తవ్వించిన చెరువులు అనపోత సముద్రం, రాయ సముద్రం, నాగసముద్రం నేటికీ జలాలతో నిండుగా ఉండడం విశేషం. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సీమలుగా విభజించి దుర్గాధిపతులను నియమించారు. దేవరకొండ దుర్గాన్ని, దేవాలయాలను నిర్మించారు. పద్మనాయకుల పాలనలో వస్త్రాల తయారీ, కలంకారీ, అద్దకపు పరిశ్రమ కూడా ఉండేది. ఇంత గొప్ప చారిత్రక వారసత్వాన్ని రక్షించే ప్రయత్నాలు ఇక్కడ జరగడం లేదు.


కవులు, కళాకారులకు నిలయం

రాచకొండ రాజ్యంలో సంస్కృత భాషకు ఆదరణ ఉండేది. పద్మనాయకుల ఆస్థానంలో కొలువుదీరిన తెలుగు కవుల్లో గౌరన, పోతన ప్రసిద్ధులు. పోతనామాత్యులు రాజు కోరికపై భోగినీ దండకం రచించారు. పరమేశ్వరార్పణగా మహాభాగవత రచన ప్రారంభించారు. ఆ కావ్యాన్ని రాజుకు అంకితమివ్వడానికి నిరాకరించారు. రాజాస్థానాన్ని ఆశ్రయించి జీవించుట హేయమని భావించి జన్మస్థలం బమ్మెర చేరి హాలిక వృత్తిలో జీవించారు. మహాకవి శ్రీనాధుడు రాచకొండను సందర్శించి సన్మానం పొందారు. ఇక్కడ కవులకు, కళాకారులకు గౌరవముండేది. రాచకొండ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే గోలకొండ, భువనగిరి, ఓరుగల్లు, పోతన జన్మస్థలం బమ్మెర తదితర ప్రదేశాలను చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించి ప్రభుత్వం పర్యటక కేంద్రాలుగా అభివృద్ధి పరుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశమ వార్షికోత్సవాల సందర్భంగానైనా రాచకొండ ప్రాభవాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.  


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని