logo

రగ్బీలో రాణిస్తూ..విజయాలు సాధిస్తూ..!

రగ్బీ క్రీడపై వివిధ జిల్లాల్లో రగ్బీ అసోసియేషన్‌ చేపడుతున్న అవగాహన శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Updated : 03 Jun 2023 05:58 IST

మఠంపల్లిలో రగ్బీ ఆడుతున్న క్రీడాకారులు

మఠంపల్లి, న్యూస్‌టుడే: రగ్బీ క్రీడపై వివిధ జిల్లాల్లో రగ్బీ అసోసియేషన్‌ చేపడుతున్న అవగాహన శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా అసోసియేషన్ల ఆధ్వర్యంలో గత సంవత్సరం పాఠశాలల్లో విద్యార్థులకు బంతులను పంపిణీ చేసి స్థానిక క్రీడాకారులతో రగ్బీపై ఆసక్తి కలిగిస్తూ నిత్యం సాధన చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆటలకు విశాల క్రీడా మైదానాలు ఉన్న మఠంపల్లిలో ఇప్పటికే పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. తాజాగా మండల కేంద్రంలోని మాంట్‌ఫోర్ట్‌ పాఠశాల మైదానంలో జరిగిన జూనియర్‌ బాల, బాలికల పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు, 15 మంది కోచ్‌లు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సైతం ఇక్కడే పూర్తి చేశారు. రగ్బీ ఆటపై యువ క్రీడాకారుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘న్యూస్‌టుడే’.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా:

మూడేళ్లుగా రగ్బీ ఆడుతున్నాను. గతంలో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నాను. ఇప్పటివరకు రెండు సార్లు జిల్లా, ఓ సారి రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. ప్రస్తుతం జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈ నెలలోనే పుణెలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జూనియర్‌ బాలుర జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాను.

రాఘవేంద్ర, సూర్యాపేట జిల్లా

పాఠశాల నుంచే అవగాహన:

పాఠశాల నుంచే రగ్బీపై అవగాహన ఉంది. కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నాను. జిల్లా స్థాయిలో పలుమార్లు, రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు పాల్గొన్నాను. ఇక్కడ జాతీయ స్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉన్న కొద్ది రోజులు సాధన చేసి జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాను.

శ్రీవిద్య, సూర్యాపేట జిల్లా

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో:

జిల్లా కేంద్రంలో జరిగిన శిక్షణ కేంద్రానికి హాజరై రగ్బీలో మెలకువలు నేర్చుకున్నాను. జూనియర్‌ బాలికల విభాగంలో పాల్గొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కడ పోటీలు జరిగినా తప్పక వెళుతుంటాను.

అఖిల, నల్గొండ జిల్లా

శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం:

2017నుంచి రగ్బీపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్ర అసోసియేషన్‌, సర్పంచి తదితరుల సహకారంతో మఠంపల్లిలో రెండు సార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాం. ఇప్పటివరకు 40కి పైగా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి బంతులు అందజేశాం. రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీపై ఆసక్తి పెరుగుతోంది. జాతీయ స్థాయికి ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.

కె.తరుణ్‌రెడ్డి, టోర్నమెంట్‌ నిర్వాహక కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని