logo

పాల సరఫరా టెండర్లలో గోల్‌మాల్‌

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాలు, పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి (2023 - 24) పాలు సరఫరా చేసే టెండర్లలో గోల్‌మాల్‌ చోటు చేసుకున్నట్లు తెలిసింది.

Updated : 04 Jun 2023 05:16 IST

ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటుకు అప్పగించేందుకు అధికారుల ప్రయత్నం

ఈనాడు, నల్గొండ : నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాలు, పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి (2023 - 24) పాలు సరఫరా చేసే టెండర్లలో గోల్‌మాల్‌ చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విద్యా సంస్థలకు పాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ సంస్థ ముందుకొచ్చి ప్రైవేటు సంస్థల కంటే లీటరు రూ.4 తక్కువ కోట్‌ చేసినా.. అధికారులు లీటరుకు రూ.62తో పాలను సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖ అధికారులకు ప్రైవేటు సంస్థ నుంచి భారీగానే ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే మైనార్టీ శాఖ పరిధిలోని విద్యా సంస్థలకు పాలు సరఫరా చేసే బాధ్యతను ఉన్నతాధికారుల చొరవతో విజయ డెయిరీకే అప్పగించడం విశేషం. నల్గొండ, సూర్యాపేటల్లో మాత్రం అధికారులు తాము రాజకీయ ఒత్తిళ్లతోనే ప్రైవేటు సంస్థ వైపు మొగ్గుచూపుతున్నారని వెల్లడిస్తుండటం కొసమెరుపు.

అసలేం జరిగిందంటే..?

తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌తో పాటూ మైనార్టీ శాఖల్లోని విద్యా సంస్థలకు నిత్యావసరాల వస్తువులతో పాటూ పాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం గత నెల 15న సర్య్కూలర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం నల్గొండ జిల్లాలోని 21 బీసీ, మైనార్టీ విద్యా సంస్థలతో పాటూ సూర్యాపేట జిల్లాలోని సుమారు 14 విద్యా సంస్థలకు పాలను సరఫరా చేసేందుకు రెండు జిల్లాల అధికారులు టెండర్లను ఆహ్వానించారు. పాల సరఫరాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయను తొలి ప్రాధాన్యతగా పరిగణనలోకి తీసుకోవాలంటూ గత నెల 16న మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్లలో విజయ డెయిరీ లీటరుకు రూ.58 చొప్పున కోట్‌ చేయగా..ప్రైవేటు డెయిరీ రూ.62కు కోట్‌ చేసింది. అయితే నాలుగు రూపాయలు ఎక్కువగా కోట్‌ చేసిన ప్రైవేటు డెయిరీకే మైనార్టీ విద్యా సంస్థలకు పాల సరఫరా టెండర్‌ను అప్పగించేందుకు అధికారులు సన్నద్ధమయినట్లు సమాచారం.

* ఉదాహరణకు నల్గొండ జిల్లాలో మొత్తం 21 విద్యా సంస్థలకు నిత్యం 2300 లీటర్ల పాలను వినియోగిస్తున్నారు. ప్రైవేటు డెయిరీ ధర రూ.62 కాగా..విజయ ధర రూ.58 అంటే రోజూ అధికారులు రూ.9200లు అధికంగా చెల్లిస్తున్నారు. నెలకు సుమారు రూ.2.76 లక్షలు అనుకుంటే విద్యా సంవత్సరం పది నెలలు ఉంటుంది.ఈ లెక్కన  రూ. 27.60 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లే. ఒక్క నల్గొండ జిల్లాలోని 21 విద్యా సంస్థలకే ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే త్వరలోనే బీసీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ వసతిగృహాలకు టెండర్‌ నోటిఫికేషన్‌ పడుతుందని.. వీటన్నింటినీ కలుపుకొంటే దుర్వినియోగం అయ్యే ప్రజాధనం రూ.కోట్లలోనే ఉంటుందని సమాచారం.

అధికారులు, డెయిరీ నిర్వాహకులు ఏమంటున్నారంటే...?

మరోవైపు అధికారులు మాత్రం విజయ డెయిరీ తమ నిబంధనల ప్రకారం టెండర్లలో పాల్గొనలేదని చెబుతుండగా..ప్రభుత్వ సంస్థ నిర్వాహకులు మాత్రం తాము ప్రభుత్వ నిధులతో ఏర్పడిన సంస్థ అని, విద్యా సంస్థలకు పాలను సరఫరా చేయడానికి టెండర్లలో పాల్గొనకున్నా ఓ లేఖ ఇస్తే సరిపోతుందని వెల్లడిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని