వాహనాల మరమ్మతుల్లో చేతివాటం?
ఉమ్మడి జిల్లాలోని పుర పాలికల్లో వాహనాల నిర్వహణ గాడి తప్పుతోంది. మరమ్మతులకు శాస్త్రీయమైన వ్యవస్థ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.
మున్సిపాలిటీల్లో నిరంతర దందా
భువనగిరిలో మరమ్మతులకు నోచుకోని చెత్త సేకరణ వాహనం
భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని పుర పాలికల్లో వాహనాల నిర్వహణ గాడి తప్పుతోంది. మరమ్మతులకు శాస్త్రీయమైన వ్యవస్థ లేకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. అత్యధిక పురపాలికల్లో డ్రైవింగ్‌లో పూర్తి స్థాయి అవగాహన, అనుభవం లేని వారు వాహనాలు నడుపుతుండటంతో తరచూ మరమ్మతులకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల పరిధిలో 19 పురపాలికలు ఉండగా 17 పురపాలికల్లో ప్రజలకు సేవలు అందించేందుకు 361 వాహనాలను వినియోగిస్తున్నారు. పురపాలక నూతన చట్టం అమలులో భాగంగా అన్ని పురపాలికలకు 2017 నుంచి అంచెలంచెలుగా ప్రభుత్వం కొత్త వాహనాలు సమకూర్చింది. ప్రస్తుతం వాహనాల మరమ్మతుల పేరిట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా సుమారు రూ.1.50 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. గతంలో కొనుగోలు చేసిన వాహనాలతో పాటు కొత్త వాహనాల మరమ్మతులు, నిర్వహణపైౖ నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో ప్రజలకు సకాలంలో సేవలు అందకపోవడంతో పాటు మరమ్మతుల పేరిట భారీగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పురపాలికల్లో ఇదీ పరిస్థితి..
నల్గొండలో ఇద్దరు మెకానిక్‌లతో అధికారులే మరమ్మతులు చేపడుతున్నారు. చాలా చోట్ల ప్రైవేటు మెకానిక్ షెడ్లను ఆశ్రయిస్తుండటం గమనార్హం. వాహనానికి మరమ్మతులు నిర్వహించాలన్న ప్రతిపాదనను సంబంధిత డ్రైవర్ అధికారులకు చెబుతున్నాడు. ఈ విషయాన్ని పారిశుద్ధ్య విభాగం అధికారులు డీఈలకు తెలిపి మరమ్మతులు చేయిస్తున్నారు. సివిల్ ఇంజినీర్ అయిన డీఈ వాహనాల మరమ్మతులపై విషయ పరిజ్ఞానం లేకపోవడంతో మెకానిక్‌లు, డ్రైవర్లు, అధికారులు బిల్లుల్లో చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరమ్మతుల సందర్భంలో వాహనాలకు నకిలీ సామగ్రిని వేసి బిల్లులు తీసుకుంటున్నట్లు తెలిసింది. రోజు వారీగా వచ్చే చిన్నచిన్న మరమ్మతులతో పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్, ఆయిల్ చేంజ్, క్లచ్ ప్లేట్ల, బ్రేక్‌పెడల్స్‌ల మార్పిడి, సెల్ప్ మోటారు, టైర్ల నిర్వహణకు ఒక్కో పురపాలిక లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. కొన్ని సందర్భాల్లో వాహనాల మరమ్మతుల కోసం నెలల తరబడి ప్రైవేటు మెకానిక్ షెడ్లలో నిలుపుతుండటంతో వాహనాల ఒరిజినల్ విభాగాలు మారుస్తున్నట్లు తెలిసింది. మరి కొందరు స్పేర్‌పార్ట్ వేయకుండానే బిల్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
* ఆర్టీసీ, వైద్యఆరోగ్యశాఖలు తమ వాహనాల మరమ్మతులకు కేంద్రీకృత మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేపడుతున్నాయి. పెద్ద ఎత్తున వాహనాలు ఉన్న పురపాలికల్లోని వాహనాల మరమ్మతులకు కేంద్రీకృత మరమ్మతుల వ్యవస్థను ఏర్పాటు చేసిన పక్షంలో ప్రజాధనం సద్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుని వాహనాల మరమ్మతుల వ్యవస్థ లేదా ఆన్‌లైన్ టెండర్ వ్యవస్థను పారదర్శకంగా అమలు చేసిన పక్షంలో ప్రజలకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రజాధనం సద్వినియోగమయ్యే అవకాశం ఉంది.
టెండర్‌తో మరమ్మతులు:
గత రెండేళ్లుగా వాహనాల మరమ్మతులకు ఆన్‌లైన్ టెండర్లు నిర్వహిస్తున్నాం. మరమ్మతుల కోసం గత సంవత్సరం రూ.15 లక్షలు ఖర్చు చేశాం. ప్రస్తుత సంవత్సరంలో రూ.20 లక్షలు ప్రతిపాదించాం. టెండరు పొందిన గుత్తేదారు కార్యాలయం వద్దకే వచ్చి వాహనాలకు మరమ్మతులు నిర్వహిస్తారు. మరమ్మతు బిల్లులను ఎంబీ రికార్డు చేసి చెల్లిస్తున్నాం. మరమ్మతు ప్రక్రియను సంబంధిత ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.
నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, భువనగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.