logo

నాడు కార్తెలు.. నేడు వాతావరణ వార్తలు

పూర్వకాలంలో కార్తెలే అన్నదాతకు వర్షపు సూచనలు ఇచ్చేవి. కార్తెల ఆధారంగా వర్షం ఎపుడు వస్తుందో పసిగట్టి ప్రకృతి చూపించిన దారిలో నడిచేవారు. రైతుల అంచనాలకు తగినట్లుగానే వర్షాలు పడేవి. దీంతో పంటలు సాగు చేసేవారు.

Updated : 04 Jun 2023 05:22 IST

వానాకాలం పంట సాగుకు ఇవే సూచనలు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: పూర్వకాలంలో కార్తెలే అన్నదాతకు వర్షపు సూచనలు ఇచ్చేవి. కార్తెల ఆధారంగా వర్షం ఎపుడు వస్తుందో పసిగట్టి ప్రకృతి చూపించిన దారిలో నడిచేవారు. రైతుల అంచనాలకు తగినట్లుగానే వర్షాలు పడేవి. దీంతో పంటలు సాగు చేసేవారు. ఈ అధునాతన కాలంలో అందుకు భిన్నంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.   ఆదివారం ఏరువాక సాగే సమయంలో నాడు..నేడు పరిస్థితులపై కథనం.

పశువులే యంత్రాలుగా..

రోహిణి కార్తె(మే 25 నుంచి జూన్‌ 7వరకు)లో ఎక్కువగా దుక్కి దున్నేందుకు రైతులు సమాయత్తం అయ్యేవారు. అడపాదడపా వచ్చే వానలకు నేలతల్లిని చల్లబరిచి ఏరువాకతో అరకలు కట్టి ఇంటి ఇల్లాలితో సద్ది తెప్పించుకుని పొలం పనులు మొదలు పెట్టేవారు. పశువులనే యంత్రాలుగా చేసుకుని వేకువజామునే కొటేరు వేసుకుని పొద్దు నెత్తిమీదకు వచ్చే వరకు దుక్కి దున్ని వచ్చేవారు. మృగశిర కార్తె (జూన్‌ 8 నుంచి 22 వరకు)లో కొన్ని ప్రాంతాల్లో మెట్ట పంటలు వేసేవారు. వర్షం పడితే గట్లపై, పొలంలో ఎక్కడైనా రాళ్లు రప్పలు, చెత్త లేకుండా శుభ్రం చేయడం, పిచ్చిచెట్లు తొలగించడం, పశువుల ఎరువు తోలుకోవడం వంటి పనులు చేసేవారు. ఇపుడు పొలంలో చెత్తలేకుండా కాల్చేస్తున్నారు. ఆరుద్ర కార్తె వచ్చే సమయానికి విత్తుకోవడానికి అనువుగా పొలం సిద్ధంచేసేవారు. గుంటక, దంతె, గొర్రుతో దుక్కి దున్నేవారు. గుంటక తోలితే మట్టిని తిరగవేస్తూ మొక్కలను కత్తిరించుకుంటూ గడ్డిలేకుండా చేసేది. ఆరుద్ర అసలైన రైతు కార్తె. వానాకాలం పంటకు ఆధారం ఇదే. ఈ కార్తెలోనే రైతులు మెట్ట పంటలు సాగుచేయడం, వరి నార్లు, నేరుగా విత్తనాలు చల్లడం చేసుకుంటారు. ఈ కార్తెలో వేస్తే పంట బాగా పండుతుందని అన్నదాత నమ్మకం. వర్షాలు సైతం ఇదే కార్తెలో పడతాయి. పునర్వసు కార్తెలో నార్లు పెంచడం, మెట్ట విత్తనాలు వేసిన వారు కలుపు లేకుండా చూసుకోవడం, ఆలస్యమైన వారు మెట్ట పంటలు వేసుకోవడం చేస్తుంటారు. ఆగస్టు 3 నుంచి అశ్లేష కార్తె, ఆగష్టు 17 నుంచి మఖ కార్తె వరకు నాట్లు పూర్తిచేసేవారు. వరినాట్లు పుబ్బ కార్తె (ఆగష్టు 31 నుంచి) కంటే ముందు వేసేవారు. పుబ్బలో వేస్తే పండవనే నానుడి. దాదాపు ఆగస్టు 30 లోగా నాట్లు పూర్తి చేసి కలుపు తీసే పనులకు శ్రీకారం చుట్టేవారు. పశువులతో వ్యవసాయం కావడంతో సకాలంలో పనులు చేసేవారు. కరవు ఏర్పడే పరిస్థితులను అంచనా వేసేవారు. ఉత్తర కార్తె వరకు వర్షం పడలేదంటే ఇక వర్షాలు రావని, పంటలు సాగు చేసుకోలేమని రైతుల అభిప్రాయం. అందుకే ఉత్తర చూసి ఎత్తర గంప అనేవారు. అంటే ఉత్తర కార్తె వరకు వర్షం రాకపోతే పశువులతో సహా కొద్దిరోజులు జీవనం కోసం వలస వెళ్లేవారు.

వర్షాలు ఇలా గుర్తించేవారు..

ఇపుడు అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే సూచనలను వాతావరణ శాఖ సూచిస్తోంది. అపుడు అల్పపీˆడనం, వాయుగుండం, నైరుతి రుతుపవనాలు ఆగమనం అంటూ అంతగా తెలియవు. ఆకాశంలో సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో మబ్బు ఎర్రగా మారేది. కొలిమిలో ఇనుము కాల్చితే కన్పించే ఎరుపు రంగులో ఉంటే వర్షం రావడానికి సూచనగా చెప్పుకునే వారు. దాంతోపాటు సూర్యుని చుట్టూ వలయాలు ఏర్పడితే వర్షం వస్తుందనే నమ్మకం. అల్పపీˆడనం ఏర్పడే ముందు ఆకాశంలో మబ్బులు చిన్న సమూహాలుగా కన్పిస్తాయి. అవి చేప పొలుసులుగా ఉంటే తప్పనిసరిగా నేడో రేపో వర్షం వస్తుందని రైతులు నమ్మేవారు. ఇపుడు సైతం కొంతమేర పొలుసులుగానే ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఇలా వర్షం వచ్చే సూచనలు పసిగట్టేవారు. ఆగ్నేయంలో నాలుగు రోజులు వేడి గాలులు వీస్తే వాయువ్యంలో మబ్బు పట్టి కచ్చితంగా వర్షం పడినట్లేనని రైతుల నమ్మకం. అలాగే వ్యవసాయం చేశారు. పల్లెల్లో నేటికీ¨ కొన్ని ఆచారాలను ఆచరిస్తున్నారు.

వాతావరణ శాఖ పైనే..

ఇపుడు పూర్తిగా వాతావరణ శాఖపైనే ఆధార పడుతున్నారు. వర్షం వస్తుందంటే రాదు. రాదంటే వస్తుంది. ప్రకృతిలో చెట్ల నరికివేతతో అనర్థాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ సైతం స్పష్టమైన అంచనాకు రాలేకపోతుంది. ఇపుడిపుడే హరితహారంతో కొంతమేర చెట్లు కన్పిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు