logo

ప్రాణం తీసిన అతివేగం

రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 04 Jun 2023 04:12 IST

ప్రమాదానికి గురైన తెలుకుంట్ల నరేశ్‌ కుటుంబసభ్యులు

తిరుమలగిరి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ సమీపంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లి గ్రామానికి చెందిన తెలుకుంట్ల నరేశ్‌ తిరుమలగిరిలో జరిగిన తమ బంధువుల శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. తొండ సమీపంలో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ వెనుక నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నరేశ్‌, అతని భార్య స్వరూప(30) మూడేళ్లలో వయస్సున్న కూతుళ్లు ఆద్య, అక్షితకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 వాహనంలో సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ స్వరూప మృతిచెందారు. మిగతా ముగ్గురిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మృతురాలి తండ్రి బొల్లోజు వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.శివకుమార్‌ తెలిపారు.


భర్త వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణం

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రేవూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై సురేష్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేవూరు గ్రామానికి చెందిన జూనెబోయిన నాగరాణి (23) వివాహం అదే గ్రామవాసి జూనెబోయిన లక్ష్మణ్‌తో ఆరేళ్ల కిందట జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. పెద్దల సమక్షంలోనూ పంచాయితీ చేశారు. అతనికి సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన రాత్రి కూడా భర్త వేధించాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు వెంకట శ్రీను నాగరాణిని పుట్టింటికి తీసుకెళ్లారు. రెండో తేదీ ఉదయం ఆమె అత్తగారింటికి వెళ్లింది. ఎలా ఉందోనని సోదరుడు వెంకట్‌ చెల్లిని పలకరించేందుకు సాయంత్రం అక్కడికెళ్లారు. ఇంట్లో చూసేసరికి ఉరి వేసుకుని నాగరాణి నిర్జీవంగా కన్పించింది. అదనపు కట్నం కోసం వేధించడం వల్లనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంటూ మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని