logo

క్యాన్సర్‌ బాధితురాలి కల సాకారం

పెద్ద చదువులు చదివి ఉన్నతమైన పోలీస్‌ అధికారి కావాలన్నది ఆ యువతి కల. ఆమె ఆశలకు క్యాన్సర్‌ మహమ్మారి అడ్డంకిగా మారింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డిగ్రీతోనే చదువును ఆపాల్సి వచ్చింది.

Published : 07 Jun 2023 03:09 IST

ఎస్సైగా ఒక్కరోజు విధుల నిర్వహణ
మేక్‌ ఏ విష్‌ కార్యక్రమం ద్వారా అవకాశం

చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఎసీˆ్ప రాజేంద్రప్రసాద్‌ సమక్షంలో ఒక్కరోజు ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధరావత్‌ స్వాతి

చివ్వెంల, న్యూస్‌టుడే: పెద్ద చదువులు చదివి ఉన్నతమైన పోలీస్‌ అధికారి కావాలన్నది ఆ యువతి కల. ఆమె ఆశలకు క్యాన్సర్‌ మహమ్మారి అడ్డంకిగా మారింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డిగ్రీతోనే చదువును ఆపాల్సి వచ్చింది. చికిత్స పొందుతున్న ఆమె ఉద్యోగం సాధనకు పోటీ పరీక్షల్లో సరిగ్గా రాయలేని దుస్థితి. దీంతో తన కోరిక కలగానే మిగిలిపోతుందేమోనని బెంగ పెట్టుకున్న ఆ యువతికి మంత్రి జగదీశ్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ‘మేక్‌ ఏ విష్‌’ కార్యక్రమం ద్వారా ఒక్కరోజు ఎస్సై బాధ్యతలు నిర్వర్తించేలా చొరవ చూపారు. చివ్వెంల మండలంలోని జగనతండా పంచాయతీకి చెందిన ధరావత్‌ చాంప్లా, బూబి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వాతి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డిని  కలిసి మాట్లాడాల’ని ఉందని ఆమె వైద్యులకు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈ నెల 3న ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆమెతో కలిసి అల్పాహారం భుజించారు. అప్పుడే పోలీస్‌ కావాలని ఉందని ఆ యువతి ఆయనకు చెప్పారు. దీంతో మంత్రి చొరవ, కలెక్టర్‌ ఎస్‌.వెంకటరావు సూచన మేరకు మేక్‌ ఏ విష్‌ కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో స్వాతి ఒక్కరోజు ఎస్సై బాధ్యతలు నిర్వర్తించేలా మంగళవారం అవకాశం కల్పించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన స్వాతి స్టేషన్‌కు వచ్చిన పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని, తన ఆశయం, కల నిజజీవితంలోనూ సాకారం కావాలని ఆకాంక్షించారు. అనారోగ్యంతో కుంగిపోవద్దని, మనోధైర్యంతో కుదుట పడుతుందన్నారు. మేక్‌ ఏ విష్‌ కార్యక్రమం స్వాతిలో ధైర్యంతోపాటు ఆనందాన్ని నింపిందన్నారు. డీఎంహెచ్‌వో కోటాచలం, డాక్టర్‌ హర్షవర్ధన్‌, గ్రామీణ ఇన్‌స్పెక్టర్‌ సోమ్‌నారాయణసింగ్‌, స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై పి.విష్ణుమూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని