logo

విద్యార్థికో అవకాశం.. కార్పొరేట్‌లోకి ప్రవేశం

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి 7 జీపీఏకు పైగా సాధించిన విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తోంది.

Published : 07 Jun 2023 03:09 IST

ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు (పాతచిత్రం)

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి 7 జీపీఏకు పైగా సాధించిన విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తులను పరిశీలించి పదో తరగతిలో సాధించిన జీపీఏ, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు. సంబంధిత కళాశాల ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది. ఏటా విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో చదివే అవకాశాన్ని కల్పిస్తుండటంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. ఆసక్తిగల విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
7 జీపీఏ పైగా వచ్చినవారు అర్హులు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 సీట్లను ప్రభుత్వం కేటాయించింది. పదో తరగతి పరీక్షల్లో 7 జీపీఏకు పైగా సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం, జడ్పీ, ఎయిడెడ్‌, కస్తూర్బా, నవోదయ, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్‌ విద్య చదువుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులందరూ అర్హులే.

నిబంధనలు ఇవీ.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పత్రాన్ని దరఖాస్తుతో జతచేయాలి. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు పైగా వార్షికాదాయం మించొద్దు. కుల, స్థానిక ధ్రువపత్రాలు తప్పనిసరిగా జతచేయాలి. దివ్యాంగులు తమ వైకల్యానికి సంబంధించిన ధ్రువపత్రం అందజేయాలి. ఆధార్‌కార్డు ప్రతిని విధిగా జతచేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ.. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన జీపీఏతోపాటు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వారికి కేటాయించిన కార్పొరేట్‌ కళాశాలల వివరాలతో కూడిన సమాచారం పంపిస్తారు. వారు అన్ని పత్రాలతో సదరు కళాశాలకు వెళ్లి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో నిర్ణీత గడువులోగా చేరాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం ఇలా..

మీసేవా కేంద్రాల ద్వారా టీఎస్‌ ఈ- పాస్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలు, పదో తరగతిలో సాధించిన జీపీఏ ధ్రువీకరణతో పాటు ఇతర పత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో జత చేయాలి. నాలుగు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదివిన పాఠశాలల నుంచి తీసుకున్న ధ్రువపత్రాలు జతచేయాలి.


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జయపాల్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి, యాదాద్రి భువనగిరి

ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం రూ.36 వేలు ఎంపిక చేసుకున్న కార్పొరేట్‌ కళాశాల రుసుముకు, రూ.3 వేలు విద్యార్థి జేబు ఖర్చులకు వెచ్చించనుంది. దరఖాస్తు చేసుకునే అర్హులైన విద్యార్థులు తమకు నచ్చిన ఐదు కళాశాలలను ఆప్షన్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని