logo

దళితబంధులో దళారుల చేతివాటం..!

దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళారుల కారణంగా పక్కదారి పడుతోంది. ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లినా విచారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు.

Updated : 07 Jun 2023 05:23 IST

ఖాళీ బాండ్‌ పేపర్‌పై దళారులు తీసుకున్న సంతకాలను చూపుతున్న గుడిబండ దళితబంధు లబ్ధిదారులు

కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళారుల కారణంగా పక్కదారి పడుతోంది. ఫిర్యాదులు ఉన్నతాధికారుల వరకు వెళ్లినా విచారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. దీంతో ఫిర్యాదు చేసిన లబ్ధిదారులను స్థానిక నాయకుల అనుచరులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో దళితబంధు పథకంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పటి నుంచి నేటి వరకు స్థానిక నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆశ్రయించారు.

యూనిట్‌కు రూ.2లక్షలు..!  గుడిబండలో దళితబంధు పథకం కింద 100 యూనిట్లు మంజూరయ్యాయి. స్థానిక నేతల అనుచరులు ముందస్తుగా కొంతమంది నుంచి రూ.2లక్షల చొప్పున వసూలు చేశారు. మరికొంతమంది నుంచి రూ.లక్ష వసూలు చేసి మిగిలిన సొమ్మును యూనిట్‌ మంజూరయ్యాక ఇవ్వాల్సిందిగా దళారులు ఆదేశాలు జారీచేశారు. దీనికోసం రూ.100 ఖాళీ బాండ్‌ పేపర్లపై లబ్ధిదారుల నుంచి సంతకాలు సేకరించారు.

గేదెల పంపిణీలో గోల్‌మాల్‌..!  పాల ఉత్పత్తులు నిర్వహించుకునేందుకు ఒక్కో యూనిట్‌కు రూ.7.40 లక్షల విలువైన 8 గేదెలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. మిగిలిన సొమ్ము దాణా, వైద్య ఖర్చులకు, పశువుల బీమా కోసం లబ్ధిదారుని అకౌంట్‌లో నగదు జమ చేస్తుంది. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ.లక్ష నగదు చెల్లించబోమంటూ లబ్ధిదారులు తేల్చిచెప్పడంతో, దళారులు లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని యూనిట్‌కు నాలుగు గేదెలను లాగేసుకుంటున్నారు. గేదెలుఇవ్వని లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లనుంచి సమాచారం ఇవ్వకుండా నగదును డ్రా చేస్తున్నారు. అంతకు ముందు గొర్రెల పంపిణీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి.

ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు: శిరీష, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

దళితబంధు అవినీతిపై ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 100 శాతం దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం దళితబంధును ప్రవేశపెట్టింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే జరిగింది.


సమాచారం లేకుండా రూ.60 వేలు డ్రా చేశారు

కొప్పుల పద్మ, బాధితురాలు

కూలీ పనులకు వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. నాకు దళితబంధు ఇప్పిస్తామని గ్రామంలోని ఓ వ్యక్తి ముందస్తుగా రూ.లక్ష తీసుకున్నారు. మిగిలిన సొమ్మును యూనిట్‌ వచ్చాక ఇవ్వాలని ఖాళీ బాండ్‌ పేపర్‌పై సంతకం తీసుకున్నారు. యూనిట్‌ మంజూరయ్యాక మిగిలిన నగదును ఆర్థిక పరిస్థితులు బాగాలేక అందించలేకపోయాను. దీంతో దళారులు నా యూనిట్‌లోని నాలుగు గేదెలు తీసుకెళ్లారు. దీంతో పాటు దాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందించిన రూ.60 వేల నగదును సమాచారం లేకుండా అకౌంట్‌ నుంచి డ్రా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని