logo

అన్నదాతకు చేరువగా ఆయిల్‌పామ్‌

తక్కువ నీటి వనరులతో ఎక్కువ ఫలసాయం పొందేందుకు ప్రభుత్వం గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్‌ సాగు చేయించాలని సంకల్పించింది. ఇందుకు రాయితీలు ఇస్తూ సదరు రైతులను ప్రోత్సహించే పనికి పూనుకుంది.

Published : 07 Jun 2023 03:09 IST

సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు
రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే

ఆయిల్‌పామ్‌ మొక్కలను పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి

తక్కువ నీటి వనరులతో ఎక్కువ ఫలసాయం పొందేందుకు ప్రభుత్వం గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్‌ సాగు చేయించాలని సంకల్పించింది. ఇందుకు రాయితీలు ఇస్తూ సదరు రైతులను ప్రోత్సహించే పనికి పూనుకుంది. తొలి ఏడాది పంట సాగుపై  రైతులు అంతగా మొగ్గు చూపకపోయినా ఈసారి భారీ లక్ష్యంతో అధికారులు ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నారు. సాగు విస్తీర్ణం పెంపు బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం గమనార్హం. రానున్న సీజన్‌లో 8700 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ప్రారంభించిన ఏడాది రైతులకు అవగాహన కల్పించడంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు ముందస్తు చర్యలకు పూనుకుంటున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల వారీగా ఆయిల్‌పామ్‌ సాగుపై ఆసక్తి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ప్రాథమికంగా చేపట్టిన సర్వే మేరకు జిల్లాలో 60 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

మూడున్నర లక్షల మొక్కలు సిద్ధం

విడతల వారీగా జిల్లాల్లో సాగును విస్తరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏటా సాగు లక్ష్యాలను నిర్దేశించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. జూన్‌ నుంచి మార్చి వరకు మొక్కలు నాటేందుకు అవకాశం ఉండటంతో నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించారు. రైతులకు మొక్కలు అందించేందుకు జిల్లాకు ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు మండలం పాలడుగులో నర్సరీని ఏర్పాటు చేసి  మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటికే మూడున్నర లక్షల పామాయిల్‌ మొక్కలు సిద్ధంగా ఉండగా మరో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతుల ఆసక్తిని బట్టి నర్సరీలో మొక్కలు సరిపోని పరిస్థితుల్లో సమీప జనగామ, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా తెప్పించేందుకు సిద్ధపడుతున్నట్లు అధికారులంటున్నారు.

సమస్యలను అధిగమిస్తేనే ముందుకు

పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తేనే ఆశించిన లాభాలను గడించే అవకాశం ఉంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తొలి ఏడాది సాగుచేసిన రైతులు పంటపొలాల్లోని మొక్కలను అడవిపందులు నాశనం చేశాయి. మరికొన్ని చోట్ల కొమ్ముముక్క పురుగు ఆశించి మొక్కలను నష్టపరిచాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏటా ప్రభుత్వం ఇచ్చే రాయితీని సకాలంలో రైతులకు అందిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. తొలిఏడాది ఆయిల్‌పామ్‌ సాగుకు రాయితీని ప్రభుత్వం మంజూరు చేసినా రెండో ఏడాదికి చెందిన రాయితీ త్వరలో రైతుల ఖాతాలో పడనుందని అధికారులంటున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు నాలుగు సంవత్సరాల రాయితీ ఉంటుంది. మొక్కల సరఫరా నుంచి మొదలు పంట విక్రయాల వరకు ఆయా కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.


మొక్కలు సిద్ధంగా ఉన్నాయి

ఎ.ప్రవీణ్‌కుమార్‌, ఆయిల్‌ఫెడ్‌ జిల్లా కో- ఆర్డినేటర్‌

వచ్చే సీజన్‌లో ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం. నెల వారీగా లక్ష్యం పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. సాగుపై అవగాహన పెరిగి రైతులు ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు. మోత్కూరు మండలం పాలడుగులో మూడున్నర లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రైతులు సద్వినియోగ పరచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని