logo

నల్గొండ క్లబ్‌లో అనధికారికంగా బార్‌ నిర్వహణ

అది జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న క్లబ్‌. అందులో బడా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. అక్కడ నిబంధనలు అతిక్రమించినా పట్టించుకునే అధికారులు లేకపోయారు.

Published : 08 Jun 2023 03:23 IST

బార్‌ పేరుతో ఇచ్చిన బిల్లు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: అది జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న క్లబ్‌. అందులో బడా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సభ్యులుగా ఉంటారు. అక్కడ నిబంధనలు అతిక్రమించినా పట్టించుకునే అధికారులు లేకపోయారు. దీంతో నిర్వాహకులదే ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఏళ్ల తరబడి అనధికారికంగా బార్‌ నిర్వహిస్తూ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నా.. తనిఖీ చేసి చర్యలు తీసుకోవడానికి అధికారులు మొహమాటపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న నల్గొండ క్లబ్‌లో అనధికారికంగా బార్‌ నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో క్లబ్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్లబ్‌లో సభ్యత్వం కలిగిన సభ్యులకు వారి వెంట ఒకరికి మద్యం తాగే అనుమతి ఉన్నప్పటికీ నిర్వాహకులు మాత్రం బయట వ్యక్తులకు కూడా ఇష్టారాజ్యంగా లోపలకు అనుమతించి మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఆ క్లబ్‌ వ్యాపార కేంద్రంగా మారి ప్రైవేటు బార్‌ను తలపిస్తోంది. ఇక్కడ సమయ పాలన అనేది లేకుండా పోయింది. రాత్రి ఒంటి గంటకు కూడా బార్‌ నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. క్లబ్‌లో కేవలం రెస్టారెంట్‌కే అనుమతి ఉన్నప్పటికీ మద్యం తాగే వారికి ఏకంగా నల్గొండ క్లబ్‌ రెస్టారెంట్‌, బార్‌ అంటూ బిల్లులు కూడా ఇస్తున్నారు. బయట ఉండే ధరకంటే అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం..
   - వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ, ఆబ్కారీశాఖ

నల్గొండ క్లబ్‌కు బార్‌ అనుమతి లేదు. రాత్రి పూట 12 గంటల వరకు మాత్రమే నిర్వహించడానికి అనుమతి ఉంది. తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని